
శంకరాపురంలో గురుకులం నడిపించే గురువు ప్రభాకరుడు, శిష్యుడు సుధాముడు, రాజు గారిని కలవడానికి అడవి మార్గంగుండా నడుచుకుంటూ వెళ్లసాగారు. మార్గ మధ్యంలో కాస్త విశ్రాంతి తీసుకుందామని శిష్యుడితో అన్నాడు గురువు. ‘‘అలాగే గురువు గారు” అన్నాడు శిష్యుడు. ఒక వేప చెట్టు కింద కూర్చున్నాక “గురువు గారు అక్కడ ఎదురుగా ఆ వృక్షం చాలా వింతగా ఉందేమిటి?” అన్నాడు సుధాముడు.
“సుధామా! పొరపాటున కూడా ఆ వృక్షం దగ్గరకు వెళ్లకు ప్రమాదం జరుగుతుంది” అన్నాడు ప్రభాకరుడు. “అలాగే గురువు గారు” అన్నాడు సుధాముడు. ఇద్దరూ, చెరి రెండు అరటిపండ్లు తిన్నారు. ప్రభాకరుడు చెట్టును ఆనుకుని నిదురలోకి జారుకున్నాడు. గురువు గాఢ నిద్రలోకి వెళ్లగానే సుధాముడు మెల్లగా ఆ వృక్షం దగ్గరకు వెళ్ళాడు. “ఇటు రా నాయనా! తీయటి పళ్లు ఇస్తాను” అంది వృక్షం. వృక్షం భలేగా మాట్లాడుతోందని దగ్గరకు వెళ్ళాడు సుధాముడు. అంతే వృక్షం కుడి ఎడమ పక్కన వేళ్లాడుతున్న ఊడలు ఒక్కసారిగా కదిలి సుధాముడిని బంధించాయి.
సుధాముడు భయపడిపోయి “గురువు గారూ.. రక్షించండి.. రక్షించండి” అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు ప్రభాకరుడు దిగ్గున లేచి అటు వైపు వెళ్ళాడు. “ఓ వృక్షరాజమా! శిష్యుడు లేకుండా నేను ఎలా ఉండగలను? నన్ను కూడా బంధించు!” అని అన్నాడు ప్రభాకరుడు. “ఓ అలాగే అని ఊడలను దూరంగా విడదీసింది. వెంటనే ప్రభాకరుడు, సుధాముడిని లాగి దూరంగా తీసుకెళ్ళాడు. “మోసం.. మోసం” అంది వృక్షం. “నువ్వు మోసంతో బంధించగా లేనిది, నేను ఉపాయంతో విడిపించుకోవడం మోసం అవుతుందా?” అన్నాడు ప్రభాకరుడు.
“తెలివిగల వాడవురా” అంది వృక్షం. “నీకు ముందే చెప్పాను కదా.. ఆ వృక్షం దగ్గరకు వెళ్లవద్దని” అని కోప్పడ్డాడు ప్రభాకరుడు. “క్షమించండి గురువు గారు” అన్నాడు సుధాముడు. “సరే” అన్నాడు ప్రభాకరుడు. “గురువు గారూ ఆ వృక్షం మనిషిలాగా ప్రవర్తించడం ఏమిటీ?’’ అన్నాడు సుధాముడు. “అది మాయా వృక్షం.. కొన్ని ఊడలు స్థిరంగా ఉంటాయి. మరి కొన్ని కదిలే ఊడలతోనూ ఉంటుంది. దగ్గరకు వెళ్తే మాయ మాటలు చెప్పి బంధిస్తుంది” అని చెప్పాడు ప్రభాకరుడు. “మీరైతే తెలివిగా నన్ను విడిపించారు. మిగతా వారి పరిస్థితి ఎలాగ?” అన్నాడు సుధాముడు.
ఈలోగా కొందరు బాటసారులు విశ్రాంతి కోసం ఆగారు. వారితో వృక్షం విషయం చెప్పి ‘‘నాకు మీ సాయం కావాలి’’ అన్నాడు ప్రభాకరుడు. ఒకరిద్దరు “ఊడలను నరికేస్తే సరిపోతుంది కదా?” అని అన్నారు. “అలా చేస్తే వృక్షంలోని జీవం పోతుంది” అని చెప్పాడు ప్రభాకరుడు. “సరే మీరు ఎలా చెబితే అలా చేద్దాము” అన్నారు వారు. “సూర్యాస్తమయం అయితే వృక్షం నిద్రపోతుంది. అప్పుడు కదిలే ఊడలను బందిద్దాం.ఈలోగా అందరూ పొడవాటి తీగలను సేకరించండి” అన్నాడు ప్రభాకరుడు. అందరూ సిద్ధం చేశారు.
సూర్యాస్తమయం అయ్యింది. ప్రభాకరుడు ఏం చెయ్యాలో చెప్పాడు. అందరూ సిద్ధం చేసుకున్న లావు పాటి తీగలను తీసుకెళ్లి కుడి, ఎడమల ఉన్న కదిలే ఊడలను వృక్షం వెనుక బాగాన పెనవేసి తీగలతో గట్టిగా కట్టారు. “మీ అందరికీ ధన్యవాదాలు.. ఇక పొరపాటున వృక్షం దగ్గరకు వెళ్లిన బాటసారులకు ఎలాంటి ప్రమాదం ఉండదు” అన్నాడు ప్రభాకరుడు. అందరూ కలిసి అడవి ప్రాంతం దాటి అనుకున్న గమ్యం చేరుకున్నారు.
- యు. విజయశేఖర రెడ్డి-