బ్లూమ్‌ఫోంటీన్: అండర్–19 క్రికెట్ వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో హోరెత్తిస్తున్న యంగ్ ఇండియా సెమీస్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే గ్రూప్–1 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న ఇండియా బెటర్ రన్‌రేట్ (+3.32)తో టాప్ ప్లేస్‌లో ఉండగా, పాకిస్తాన్ (+1.06) నుంచి పోటీ ఎదుర్కొంటున్నది.
ఈ టోర్నీలో రెండో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్, స్పిన్నర్ సౌమీ పాండేపై మరోసారి భారీ ఆశలు పెట్టుకున్నారు. కెప్టెన్ ఉదయ్ సహారన్, ఆరవల్లి అవనీశ్, అర్షిన్ కులకర్ణి కూడా బ్యాట్లు ఝుళిపించాలి. ఓపెనర్ ఆదర్ష్ సింగ్, లెఫ్టార్మ్ పేసన్ నమన్ తివారీ ఫామ్‌లోకి రావాలి. మరోవైపు ప్రిలిమినరీ స్టేజ్‌లో అఫ్గానిస్తాన్‌పై నెగ్గిన నేపాల్.. ఇండియాకు షాకివ్వాలని భావిస్తోంది. కెప్టెన్ దేవ్ కనల్, పేసర్ ఆకాశ్ చంద్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు.