పార్టీపై పట్టు కోసం ఉద్ధవ్, షిండే వర్గాల ప్రయత్నాలు

పార్టీపై పట్టు కోసం ఉద్ధవ్, షిండే వర్గాల ప్రయత్నాలు
  • శాసనసభా పక్ష నేతగా నియమించాలంటూ డిప్యూటీ స్పీకర్, గవర్నర్​కు షిండే లేఖ
  • పార్టీపై, ఎన్నికల గుర్తు కోసం ఈసీని కలిసేందుకు పావులు
  • శివసేనను చీల్చేందుకు రెబెల్స్ కుట్ర పన్నారన్న ఉద్ధవ్
  • వారు వెళ్లిపోతే పార్టీని మళ్లీ నిర్మించుకుంటామని ప్రకటన
  • శివసేన నుంచి థాక్రేలను వేరు చేయలేరని కామెంట్

ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్​ హీట్​ కొనసాగుతోంది. శివసేన పార్టీపై పట్టు కోసం ఇటు సీఎం ఉద్ధవ్​ థాక్రే వర్గం, అటు రెబెల్​ లీడర్ ఏక్​నాథ్​షిండే క్యాంపు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తమదే అసలైన శివసేన అంటూ ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. తనను శాసనసభాపక్ష నేతగా నియమించాలంటూ 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను డిప్యూటీ స్పీకర్, గవర్నర్​కు పంపారు. ఇక పార్టీని చీల్చేందుకు తిరుగుబాటు నాయకులు కుట్ర పన్నారని సీఎం ఉద్ధవ్​ ఆరోపించారు. పార్టీని విడిచిపోయే వారికోసం తాము బాధపడనని, ఎవరు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని చెప్పారు. కుళ్లిన పళ్లు, ఆకులు రాలిపోతేనే మంచిదని, వేళ్లూనుకున్న మహావృక్షం లాంటి శివసేను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. 

ఉద్ధవ్​తో పవార్​ చర్చలు
తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఉద్ధవ్​తో ఎన్సీపీ చీఫ్​ శరద్​పవార్​ సమావేశమయ్యారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం అజిత్​ పవార్, ఎన్సీపీ లీడర్​ జయంత్​ పాటిల్ ఉన్నారు. ఉద్ధవ్​ నివాసం మాతోశ్రీకి వెళ్లి సుమారు రెండు గంటలకుపైగా ఆయన చర్చలు జరిపారు. కాగా, శనివారం ముంబైలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు శివసేన ప్రకటించింది. ఈ మీటింగ్​లో ఉద్ధవ్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొంటారు. మరో శివసేన ఎమ్మెల్యే రెబెల్​ క్యాంపులోకి చేరారు. దీంతో ఏక్​నాథ్​షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరినట్టుగా తెలుస్తోంది. ఇందులో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మిగతా పది మంది ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు. మరింత మంది తమ వైపు వస్తారని షిండే వర్గం చెబుతోంది.

మరో నలుగురిపై అనర్హత వేటుకు పిటిషన్
12 మంది రెబెల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్​కు లేఖ రాసిన శివసేన.. తాజాగా మరో నలుగురిపై వేటు వేయాలని కోరింది. దీంతో వీరందరికి నోటీసులు ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ ​నరహిరి జిర్వాల్​ సిద్ధమయ్యారు. అయితే శరద్​ పవార్​ పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్​ నరహరి జిర్వాల్​ను తొలగించాలని షిండే క్యాంపులోని ఇద్దరు ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు మహేశ్ బాల్డీ, వినోద్​ అగర్వాల్​ డిమాండ్​ చేశారు. అరుణాచల్​ ప్రదేశ్​ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డిప్యూటీ స్పీకర్​కు రెబెల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం లేదని అన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్​కు వ్యతిరేకంగా వారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెబెల్​ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.

రెబెల్స్​కు వ్యతిరేకంగా ఆందోళనలు
ఇక రెబెల్​ లీడర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. షిండేతో పాటు పలువురు రెబెల్​ ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడులకు దిగారు. వారి ఫ్లెక్సీలపై నల్ల ఇంకు జల్లడంతో పాటు వాటిని ధ్వంసం చేశారు. మరోవైపు శివసేన కార్యకర్తల ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర అంతటా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

పవార్​ను ఓ కేంద్ర మంత్రి బెదరించారు: రౌత్
మరోవైపు శరద్​ పవార్​ను కేంద్ర మంత్రి ఒకరు బెదిరించారని శివసేన ఎంపీ సంజయ్​రౌత్​ ఆరోపించారు. ఆయన మహారాష్ట్ర బిడ్డ అని, ఇలాంటి బెదిరింపులకు లొంగరని, ఇలాంటి బెదిరింపులను మోడీ, అమిత్​షా ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ బల పరీక్ష నిర్వహిస్తే రెబెల్​ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్​ అఘాడీకే ఓటు వేస్తారన్నారు. షిండే క్యాంపులోని 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని చెప్పారు. ఈడీ ఒత్తిడి కారణంగా పార్టీని విడిచిపెట్టేవారు నిజమైన బాల్​థాక్రే అనుచరులు కాదన్నారు. అయితే శివసేన ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిన మాట నిజమే అయినా అసెంబ్లీలో పరీక్ష పెడితే రెబెల్స్​ కూడా తమకు మద్దతిస్తారని చెప్పారు. 

భారీ మొత్తంలో నిధులు రిలీజ్
ఒకవైపు ఏంవీఏ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంటే.. ఎన్సీపీ, కాంగ్రెస్​ చేతిలో ఉన్న శాఖలు భారీ మొత్తంలో నిధులు రిలీజ్​ చేస్తున్నాయి. ఈ మేరకు గవర్నమెంట్ రిజల్యూషన్ల(జీఆర్)ను రిలీజ్​ చేస్తున్నారు. జూన్ 17న 107 జీఆర్​లను రిలీజ్​ చేస్తే.. జూన్ 20, 23 మధ్య 182 జీఆర్​లను విడుదల చేశారు. గత ఐదు రోజులుగా విడుదలైన జీఆర్​లపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని, ఈ విషయంలో గవర్నర్​ కలగజేసుకోవాలని బీజేపీ డిమాండ్​ చేసింది.

ఏ జాతీయ పార్టీ టచ్​లో లేదు: షిండే
బలమైన నేషనల్​ పార్టీ ఒకటి తమకు మద్దతిస్తామని హామీ ఇచ్చినట్టు గురువారం చెప్పిన ఏక్​నాథ్​షిండే.. ఇప్పుడు మాటమార్చారు. తమతో ఏ జాతీయ పార్టీ టచ్​లో లేదని ప్రకటించారు. అద్భుత శక్తి తమ వెనుక ఉందని తాను చెప్పిన మాటలు నిజమేనని, ఆ అద్భుత శక్తి బాల్​ థాక్రే అని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయని మీడియా ప్రశ్నించగా.. మరికొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్నారు. తమదే నిజమైన శివసేన అని, తనను శాసనసభాపక్ష నేతగా నియమించాలంటూ 37 మంది రెబెల్​ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, గవర్నర్ భగత్​ సింగ్ కోషియారి, లెజిస్లేచర్​ సెక్రటరీలకు షిండే పంపించారు. 

షిండే కోసం ఎంతో చేశా: ఉద్ధవ్
రెబెల్స్​ను బుజ్జగించేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే.. ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. షిండే కోసం సీఎం దగ్గర ఉండాల్సిన శాఖలను కూడా ఇచ్చానని, ఆయన కొడుకు ఎంపీ అయ్యారని, తన కొడుకు మాత్రం రాజకీయంగా పైకి రావొద్దా అని ఉద్ధవ్​ ప్రశ్నించారు. శివసేన నుంచి థాక్రేలను ఎవరూ వేరు చేయలేరన్నారు. తాను సీఎం నివాసం నుంచి మాత్రమే బయటకు వచ్చానని, సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తన సంకల్పంలో మార్పూ లేదన్నారు. కరోనాతో తన ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బందులు పడ్డానని, ఇదే అదనుగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్న వారి గురించి ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. శివసేన, థాక్రేల పేర్లు లేకుండా వారు ఎలా ముందుకు వెళ్లగలరన్నారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వర్చువల్​గా మాట్లాడారు. ఈ సందర్భం గా కాస్త ఎమోషనల్ అయ్యారు.