శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ 

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ 

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న సోద‌రుడి కుమారుడు నిహార్ ఠాక్రే మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. అయితే.. వారిద్దరూ ఏ విషయాలపై చర్చించారు..? ఈ సమావేశం వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

శివ‌సేన‌లో ఉద్ధ‌వ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి, మెజారిటీ ఎమ్మెల్యేల‌ను త‌న వైపునకు ఏక్ నాథ్ షిండే తిప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సీఎంగా ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స్థానంలో ముఖ్యమంత్రిగా షిండే బాధ్య‌త‌లు చేప‌ట్టారు. బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి శివ‌సేన‌లో ఉద్ధ‌వ్‌, షిండే గ్రూపుల మ‌ధ్య ఆధిప‌త్యం కోసం పోరు మొదలైంది. మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

బాల్ ఠాక్రేకు ముగ్గురు కుమారులు బిందుమాధ‌వ్‌, జ‌య్‌దేవ్, ఉద్ధ‌వ్‌ ఠాకే. నిన్న సీఎం షిండేను కలిసిన నిహార్ .. ఉద్దవ్ ఠాక్రే పెద్ద సొదరుడు బిందుమాధవ్ కుమారుడు. బిందుమాధ‌వ్ 1996లో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో చనిపోయారు. ఇక జ‌య్‌దేవ్ ఠాక్రే మూవీ ప్రొడ్యూసర్. ఈయన రాజకీయాల‌కు దూరంగా ఉన్నారు. బిందుమాధ‌వ్ త‌న‌యుడు నిహార్.. సీఎం షిండేతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యే జ‌య్‌దేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా సీఎం షిండేతో భేటీ అయ్యారు. బాల్ ఠాక్రే ముగ్గురు కుమారుల్లో ఉద్ధ‌వ్ ఠాక్రే కుటుంబం మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతోంది. 2012లో బాల్‌ఠాక్రే మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబంలో కొన్ని వివాదాలు కొన‌సాగాయి. ఇక న్యాయవాది అయిన నిహార్ ఠాక్రే.. బీజేపీ నాయ‌కుడు హ‌ర్షవ‌ర్ద‌న్ పాటిల్ కూతురు అంకితా ప‌టేల్‌ను గ‌తేడాది డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నాడు. హ‌ర్షవ‌ర్ద‌న్ పాటిల్ చాలా ఏళ్లు మంత్రిగానూ పని చేశారు.