
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాటను కట్టడి చేసుకోవాలని, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే ఇబ్బందులు తప్పవని పండితులు తెలిపారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా ప్రణీత్ కుమార్ నేతృత్వంలోని పండితుల బృందం పూజా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రణీత్‌కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. కేటీఆర్‌ది మకర రాశి అని, ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నాయన్నారు. రాజపూజ్యం, ప్రజాబలం బాగున్నాయని, అవమానాలు కొంత తక్కువగానే ఉన్నాయని తెలిపారు. అయితే, కేటీఆర్ మాటలను కట్టడి చేసుకోవాలని లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దొంగల వల్ల నష్టం కలుగుతుందని, సన్నిహితులే దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. ప్రయాణాలలో ఇబ్బంది ఉంటుందని, ప్రయాణానికి ముందు క్షేమంకరి నామస్మరణ చేయాలని సూచించారు.
ఫోన్లు పనిచేయవు
రాబోయే ఎన్నికల్లో పాలక పక్షాలకు కష్టాలు కనిపిస్తున్నాయని, ప్రతిపక్షాలు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రణీత్ కుమార్ తెలిపారు. రాజకీయ నాయకులకు ఈ ఏడాది బాగుంటుందని, అధిష్టానం ప్రేమ, ప్రజల ఆదరణతో పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో మంచి వర్షాలు పడతాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. సంవత్సర మధ్య కాలంలో నిత్యవసరాలు, బంగారం ధరలు పెరుగుతాయన్నారు. అన్ని రాశుల వారికీ ఈ ఏడాది వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కుజుడిని ఆరాధిస్తే శాంతి కలుగుతుందని చెప్పారు. దేశంలో మతపరమైన కల్లోలాలు జరుగుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు, వరదలు వస్తాయన్నారు. ఈ ఏడాది టెక్నాలజీకి విఘాతం కలుగుతుందని, ఫోన్లు పని చేయవన్నారు. ఈ ఏడాదే టెక్నాలజీ పునరుద్ధరణ కూడా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కాలె యాదయ్య, కాసాని జ్ఞానేశ్వర్, శంభీపూర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు వాహన ప్రమాద ముప్పు
బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్‌ది కర్కాటక రాశి అని, ఈ రాశి వారికి వాహన ప్రమాద గండం ఉందని ప్రణీత్ కుమార్ తెలిపారు. ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దని సూచించారు. దోష నివారణ కోసం చవితి నాడు లక్ష్మీ గణపతి, మోహన గణపతిని దర్శించుకోవాలన్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కర్కాటక రాశి వారికి ఆదాయ, వ్యయాలు అత్యంత సంతోషకరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అన్ని వ్యవహారాల్లోనూ విజయం సాధిస్తారన్నారు. ఈ రాశి వారి మాటకు, గమనానికి అడ్డులేనట్టుగా ఈ ఏడాది ఉంటుందన్నారు.