
- వెంటనే రిపోర్టు ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్‌కు ఆదేశం
- వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి..
- వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై యూనివర్సిటీ గ్రాంట్స్కమిషన్(యూజీసీ) సీరియస్అయింది. రిజిస్ట్రార్, ప్రొఫెసర్ల నియామకాలపై వచ్చిన ఆరోపణలు, ఏసీబీ దాడులు, ఇతర వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుకు గురువారం మెయిల్ పంపించింది. ఈ విషయం శుక్రవారం బయటకు వచ్చింది. యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అసోసియేషన్ఆఫ్కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) ఫిర్యాదు చేయడంతో యూజీసీ స్పందించింది. వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు, ఇతర వివాదాస్పద అంశాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్ ను ఆదేశించింది. కాగా, ఈ విషయమై కేయూ వీసీని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
‘అకుట్’ ఫిర్యాదుతో..
వీసీగా ప్రొఫెసర్తాటికొండ రమేశ్బాధ్యతలు తీసుకున్న తర్వాత వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అసోసియేషన్ఆఫ్కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్టి.శ్రీనివాస్, మామిడాల ఇస్తారి యూజీసీకి ఫిర్యాదు చేశారు. కనీసం పదేండ్ల అనుభవం కూడా లేని ప్రొఫెసర్ రమేశ్‌ను వీసీగా నియమించడం వల్లే వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. ‘‘యూనివర్సిటీల చట్టానికి విరుద్ధంగా రిటైర్డ్ప్రొఫెసర్ను రిజిస్ట్రార్‌గా నియమించారు. యూజీసీ రూల్స్, వర్సిటీ యాక్ట్, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా 16 మంది అనుబంధ అధ్యాపకులను నియమించి నెలకు రూ.8 లక్షల ప్రజాధనాన్ని వృథా చేశారు. వీసీ, రిజిస్ట్రార్ ఇద్దరూ అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు తీసుకుని.. అర్హులైన వారికి మాత్రం ప్రమోషన్లు నిలిపివేశారు. ఆర్ట్స్ కాలేజీలో పనిచేసే అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్యను క్యాంపస్ కు బదిలీ చేయించుకుని.. కీలకమైన విభాగాల్లో ఆయనను అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించి అక్రమాలకు తెరలేపారు. వివిధ విభాగాల్లో పనిచేసే టీచర్లపై వ్యక్తిగత కక్షలకు పాల్పడడమే కాకుండా హెచ్‌వోడీ, బీవోఎస్ చైర్మన్, డీన్ లాంటి పదవులను తమకు నచ్చిన వారికే అప్పగిస్తున్నారు. వర్సిటీ భూములను కబ్జా చేసిన వారికి వంతపాడటంతో పాటు పీహెచ్ డీ సీట్ల కేటాయింపులో అనేక అవకతవలకు పాల్పడి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చారు. తాజాగా పాల బిల్లు చెల్లించేందుకు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత ఓ ఉద్యోగి మరణించారు. దీనికీ వర్సిటీలో జరుగుతున్న అక్రమాలే కారణం” అని యూజీసీ దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం రేవంత్‌కూ కంప్లయింట్..
యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇటీవల ఫిర్యాదు చేసినట్టు ‘అకుట్’ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్టి.శ్రీనివాస్, మామిడాల ఇస్తారి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వర్సిటీలో గత రెండున్నరేండ్లుగా అక్రమాలు జరుగుతున్నాయి. టీచర్లపై వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారు. ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు” అని సీఎం రేవంత్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే యూజీసీకి కూడా ఫిర్యాదు పంపించామని, దానికి యూజీసీ స్పందించి.. యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్ ను ఆదేశించిందని చెప్పారు.