
సికింద్రాబాద్, వెలుగు: లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ఆదివారం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణిగా ఉంటారని భక్తుల నమ్మకం. దీంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బోనాలను తీసుకొచ్చి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆనవాయితీగా అత్తెల్లి కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈఓ మనోహర్‌రెడ్డి తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వానం
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢం బోనాల ఉత్సవాలకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆలయ అర్చకులు, ఈఓ కోరారు. ఆదివారం మంత్రి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు.
కమిటీ సభ్యుడిని లాక్కెళ్లిన బీఆర్ఎస్ లీడర్
అధికార పార్టీకి చెందిన ఆలయ కొత్త కమిటీ సభ్యుడిని బీఆర్ఎస్ నేత బయటకు లాక్కెళ్లి అవమానించాడు. ఈవో ఆఫీసులో ఉత్సవ కమిటీ సభ్యుడు శ్రీకాంతాచారి కూర్చుని ఉండగా బీఆర్ఎస్ నేత మహేశ్ యాదవ్ .. ‘ మా వాళ్లు లోపల కూర్చుంటారు. నువ్వు బయటకు వచ్చెయ్’ అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుని ఈవో చాంబర్ నుంచి బయటకు తీసుకొచ్చారు.
పోలీసులు వారించినా వినకుండా బయటకు నెట్టేశాడు. అధికార పార్టీకి చెందిన తనకు అవమానం జరిగిందని రాజీనామా చేస్తానని శ్రీకాంతాచారి ఆవేదన వ్యక్తం చేస్తూ.. దీనిపై ఈవో మనోహర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
లాల్ దర్వాజా బోనాల వేడుకలకు ప్రత్యేక అధికారి నియామకం
హైదరాబాద్,వెలుగు: లాల్ దర్వాజా మహంకా ళి ఆలయంలో ఈసారి ఆషాఢ బోనాల వేడుకల నిర్వహణకు దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారిగా అంజనరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు కొందరు భక్తుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో స్పందించిన దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారిని నియమించింది.
ఈ ఏడాది ఆషాఢ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించడానికి తమ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించడంపై ఆలయ కమిటీ ప్రతినిధులు శివకుమార్ యాదవ్, సదానంద్ ముదిరాజ్, సురేందర్ ముదిరాజ్, బద్రీనాథ్ గౌడ్,కాశీనాథ్ గౌడ్, రంగ శ్రీకాంత్ గౌడ్, పులి కంటి నరేశ్ హర్షం వ్యక్తం చేశారు.