ఒకే రోజు 4 బ్రాంచ్​లు ప్రారంభం

ఒకే రోజు 4 బ్రాంచ్​లు ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: బెంగళూరుకు చెందిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్​ఎఫ్​బీ) తెలంగాణలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్​లోని మాదాపూర్, కూకట్‌‌పల్లి, ఏఎస్ రావు నగర్,  సికింద్రాబాద్‌‌లో బ్రాంచ్​లను మొదలుపెట్టింది.  మాదాపూర్‌‌ బ్రాంచ్​ను తెలంగాణ హోంమంత్రి మహమ్మద్‌‌ మహమూద్‌‌ అలీ ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఉత్తరాది రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా మరో 27 శాఖలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.  ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో ఇట్టిరా డేవిస్ విలేకరులతో మాట్లాడుతూ..తమకు దేశంలో 598 బ్రాంచ్​లు ఉన్నాయని, 71 లక్షల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు.  ‘‘తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాంచీలను తెరుస్తాం. వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్‌‌లోకి వస్తాం. బ్యాంకు పొదుపు ఖాతాలపై 7.5 శాతం, సీనియర్ సిటిజన్‌‌లకు ఎఫ్​డీలపై 8.75 శాతం,  సాధారణ కస్టమర్లకు 8 శాతం వడ్డీ ఇస్తున్నాం. 

గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్​ సేవలను అందించడానికి 25 శాతం బ్రాంచ్​లను పల్లెటూళ్లలో నిర్వహిస్తున్నాం. మా డిపాజిట్​ బేస్​రూ.21 వేల కోట్ల వరకు ఉంది. వీటిలో రిటైల్ లోన్ల విలువ రూ.14 వేల కోట్ల వరకు ఉంది. డిజిటలైజేషన్​కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇటీవలే వీడియో కేవైసీ మొదలుపెట్టాం.  2022 సెప్టెంబరు నాటికి, బ్యాంక్ స్థూల ఎన్‌‌పీఏలు 3.3 శాతం,  నికర ఎన్‌‌పీఏలు 0.04 శాతం ఉన్నాయి. బ్యాంక్​కు గత రెండు క్వార్టర్లలో (హెచ్​1) రూ. 497 కోట్ల లాభం వచ్చింది. పోయిన ఏడాది నష్టాలు వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరం మాకు ‘బెస్ట్​ఇయర్​’ అవుతుంది. డిసెంబర్ క్వార్టర్లో రిటైల్ డిపాజిట్లు వార్షికంగా 9 శాతం  పెరిగాయి.  ఎంఎస్​ఎంఈలకు రూ. 10 లక్షల నుంచి రూ. 10 కోట్ల వరకు, రూ. 5 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు హోంలోన్లు ఇస్తున్నాం. త్వరలో గోల్డ్​లోన్లను మొదలుపెడతాం. మరిన్ని కొత్త ప్రొడక్టులను తెస్తాం”అని వివరించారు. బ్యాంక్‌‌ ఛైర్మన్‌‌ బీఏ ప్రభాకర్‌‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.