జెలెన్ స్కీ తో ఇంగ్లాండ్ పీఎం బోరిస్ జాన్సన్ భేటీ

జెలెన్ స్కీ తో ఇంగ్లాండ్ పీఎం బోరిస్ జాన్సన్ భేటీ
  •     క్రామటోర్స్క్‌‌ రైల్వే స్టేషన్‌‌పై మిసైల్‌‌ దాడిపై చర్యలు చేపట్టాలి

కీవ్: రైల్వే స్టేషన్‌‌పై మిసైల్ దాడి చేసిన రష్యాకు కఠినంగా బదులివ్వాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్‌‌ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్‌‌స్కీ కోరారు. క్రామటోర్స్క్ సిటీ రైల్వే స్టేషన్ పై శుక్రవారం ఉదయం భారీ మిసైల్ దాడి జరిగిందని, రష్యా దాడుల నుంచి తప్పించుకుని వెళ్లిపోయేందుకు అక్కడ ఆ సమయంలో 4 వేల మంది దాకా ఎదురు చూస్తున్నారని చెప్పారు. శుక్రవారం రాత్రి టీవీలో జెలెన్‌‌స్కీ మాట్లాడారు. ‘‘బుచాలో జరిగిన ఊచకోతలా, అనేక రష్యన్ యుద్ధ నేరాల మాదిరిగానే.. క్రామటోర్స్క్‌‌పై క్షిపణి దాడి తప్పనిసరిగా ట్రిబ్యునల్‌‌లోని అభియోగాల్లో ఒకటిగా ఉండాలి. ఎవరేం చేశారు? ఆర్డర్స్ ఎవరిచ్చారు? మిసైల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు రవాణా చేశారు? అసలు ఎలా దాడి చేయడానికి ఒప్పుకున్నారు? అనేది తెలుసుకునేందుకు చర్యలు చేపట్టాలి’’ అని జెలెన్‌‌స్కీ డిమాండ్ చేశారు. ఈ దాడిలో 52 మందికి పైగా చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే రైల్వే స్టేషన్‌‌పై తాము ఎలాంటి దాడులు చేయలేదని రష్యా చెప్పింది. 

‘పిల్లల కోసం’ అని రాసిన్రు

క్రామటోర్స్క్ సిటీ రైల్వే స్టేషన్ పై దాడికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. మృతదేహాలపై టార్పిలిన్ కప్పడం, రాకెట్ అవశేషాలపై ‘పిల్లల కోసం’ అని రష్యన్ భాషలో రాసి ఉండటం వాటిలో కనిపించింది. ‘పిల్లల కోసం’ అని రాకెట్‌‌పై ఎందుకు రాశారనే దానిపై క్లారిటీ రాలేదు.

ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి

రైల్వే స్టేషన్‌‌పై మిసైల్ దాడిపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు మాటలు రావడంలేదని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ చెప్పారు. రష్యా చర్య యుద్ధ నేరం కిందికి వస్తుందని బ్రిటన్ డిఫెన్స్ మినిస్టర్ బెన్ వల్లస్ చెప్పారు. క్షిపణి దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు.

బోరిస్ జాన్సన్ సడన్ టూర్

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలోనే ఇంగ్లాండ్ పీఎం బోరిస్ జాన్సన్ అకస్మాతుగా కీవ్​లో పర్యటించారు. శనివారం అక్కడికి చేరుకున్న బోరిస్.. జెలెన్ స్కీ తో పర్సనల్​గా భేటీ అయ్యారు. తమ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకే బోరిస్ కీవ్​లో పర్యటించారని, ఉక్రెయిన్ కు డిఫెన్స్ సపోర్ట్ చేయడంలో యూకేదే ప్రధాన పాత్ర అని జెలెన్ స్కీ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు.