ఒక్క దాడితో 52 ట్యాంకులు మటాష్

ఒక్క దాడితో 52 ట్యాంకులు మటాష్

ఖార్కివ్: ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. రష్యన్ మిలిటరీకి చెందిన 52 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్​ఒకే దాడితో ధ్వంసం చేసింది. సివర్స్కి డోనెట్స్​ నదీ తీరంలో కీలకమైన ఓ రూట్​ను దాటుతుండగా ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన శాటిలైట్​ ఫొటోలను ఉక్రెయిన్​ రక్షణ శాఖ మీడియాకు విడుదల చేసింది. ఇందులో ధ్వంసమైన ట్యాంకర్ల నుంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించింది. ఖార్కివ్​కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం కొంతకాలంగా రష్యా అధీనంలో ఉంది. సివర్స్కి డోనెట్స్​ నదీ తీరంలో రష్యా, ఉక్రెయిన్​కు తీవ్ర పోరాటం జరిగిందని, చాలా ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్​ స్వాధీనం చేసుకుందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్​ వెల్లడించింది. తమకు అమెరికా, యూరోప్ దేశాలు అందించిన ఆయుధాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఉక్రెయిన్ సైనికుడు ఒకరు చెప్పారు. 

ఉక్రెయిన్​ను వీడిన 60 లక్షల మంది: యూఎన్

యుద్ధం వల్ల 60 లక్షల మందికిపైగా ప్రజలు ఉక్రెయిన్​ను విడిచిపెట్టి పక్క దేశాలకు వెళ్లినట్టు యూఎన్​ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. ఇందులో సగానికిపైగా జనం పొరుగు దేశమైన పోలెండ్​కు వెళ్లినట్టు పేర్కొంది. ఇందులో 90% మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు తెలిపింది. మరోవైపు, రష్యాపై యుద్ధ నేరాల అభియోగాలు పెరిగిపోతున్నాయి. వేలాది మందిని ఇంటరాగేషన్​ క్యాంపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా రష్యాపై ఉన్నాయి. రష్యా సైనికులు సాధారణ పౌరులను చంపారని, చిత్రహింసలు పెట్టారని, అత్యాచారాలకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. రష్యా సైనికులు ఇద్దరు సాధారణ పౌరులను తుపాకులతో కాల్చిచంపుతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను సీఎన్ఎన్, బీబీసీ రిలీజ్​ చేశాయి. వారిని చాలా క్రూరంగా చంపినట్టుగా ఈ వీడియోల్లో స్పష్టమవుతోంది. దీనిని యుద్ధ నేరంగా దర్యాప్తు చేయాలని సీఎన్ఎన్ డిమాండ్​ చేసింది. ఉక్రెయిన్​లో రష్యా బలగాల ఆకృత్యాలపై విచారణ జరపాలని యూఎన్​ మానవ హక్కుల మండలి 33–2 ఓట్లతో ఆమోదించింది. కాగా, రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి తమకు పది వేలకు పైగా ఫిర్యాదులు అందాయని ఉక్రెయిన్​ ప్రాసిక్యూటర్లు తెలిపారు.


యుద్ధ నేరాల కింద  రష్యా సైనికుడి విచారణ

యుద్ధం మొదలైన తర్వాత తొలి వార్​ క్రైం దర్యాప్తు శుక్రవారం మొదలైంది. ఒక రష్యన్​ సైనికుడిపై యుద్ధ నేరాల కింద కీవ్​లో విచారణ ప్రారంభమైంది. యుద్ధం మొదలైన వారంలో ఓ ఉక్రెయిన్​ పౌరుడి మరణానికి కారణమయ్యాడన్న ఆరోపణల పై రష్యా ట్యాంక్​ యూనిట్​కు చెందిన 21 ఏండ్ల సైనికుడిని కోర్టులో హాజరుపరిచా రు. ఉక్రెయిన్​ చట్టాల ప్రకారం అతడికి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.