రష్యాపై ఉక్రెయిన్ దాడి..89 సైనికులు మృతి

రష్యాపై ఉక్రెయిన్ దాడి..89 సైనికులు మృతి

ఉక్రెయిన్ దాడిలో  రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన సైనికులు 89 మంది మరణించారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఈశాన్య డోనెట్స్ ప్రాంతంలోని రష్యా సైనిక బలగాల క్యాంపుపై అమెరికా సరఫరా చేసిన ఆరు రాకెట్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.  వీటిలో రెండు రాకెట్లను కూల్చి వేశామని చెప్పింది.

 రష్యన్‌ సైనికుల శిబిరమైన వొకేషనల్‌ కాలేజీ బిల్డింగ్‌పై పెద్ద ఎత్తున రాకెట్లతో ఉక్రెయిన్ దాడిచేసింది. ఈ దాడిలో 300 నుంచి 400 మంది రష్యా జవాన్లు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అయితే ఆ దాడిని ధృవీకరించిన రష్యా రక్షణ శాఖ.. మొదట 63 మంది సైనికులు మృతిచెందారని తెలిపింది. ఆ తర్వాత  89 మంది సర్వీస్‌ మెన్‌ మృత్యువాతపడ్డారని  క్రెమ్లిన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. బిల్డింగ్‌లో ఉన్న సైనికులు అనుమతి లేకుండా మూకుమ్మడిగా సెల్‌ఫోన్లను వినియోగించడమేనని దాడికి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది. అమెరికా సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేసిన ఉక్రెయిన్‌ దళాలు....రష్యా సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డాయని పేర్కొంది. ఉక్రెయిన్ దాడిపై   ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.

మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేసే లక్ష్యంతో రష్యా 40 డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లను తమ వాయుసేన కూల్చి వేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. సరిహద్దులోని తమ గ్రామంపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసిందని రష్యా ఆరోపించింది.