రష్యా దాడుల్లో చనిపోయినోళ్లు 2,200 మంది

రష్యా దాడుల్లో చనిపోయినోళ్లు 2,200 మంది
  • మరియుపోల్​పై బాంబుల వర్షం.. నివాస భవనాలే టార్గెట్
  • నిండుకున్న తాగునీరు, ఆహార నిల్వలు
  • కరెంట్, మొబైల్​ కమ్యూనికేషన్​ లేదు

మరియుపోల్/కీవ్: ఉక్రెయిన్​లోని ప్రధాన నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరియుపోల్​లో రష్యా జరిపిన బాంబు దాడుల్లో ఇప్పటివరకు 2వేల మందికిపైగా చనిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆదివారం, సోమవారం మరియుపోల్​ సిటీలో వందకుపైగా ఏరియల్​ బాంబులను రష్యా ప్రయోగించిందని, ఈ దాడుల్లో సుమారు వందలాదిమంది చనిపోయారని తెలిపారు. రష్యా జరిపిన ఒక ఏరియల్​స్ట్రయిక్ కెమెరాలో రికార్డ్​ అయ్యింది. అపార్ట్​మెంట్ బిల్డింగ్​లే టార్గెట్​గా ఈ దాడులు జరిగినట్టు ఆ వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. గత నెలలో ప్రారంభమైన రష్యా దాడుల్లో ఈ స్థాయిలో సామాన్య జనాలు చనిపోవడం ఇదే తొలిసారి. కాగా, మరియుపోల్​లో జనాలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని, మరో 12 రోజుల పాటు పరిస్థితులు భయంకరంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో కరెంట్, నీరు బంద్​ అయ్యింది. మొబైల్​ కమ్యూనికేషన్​ పూర్తిగా కట్​ అయ్యింది. ప్రస్తుతం ఉన్న ఆహారం, నీటి నిల్వలు అయిపోవచ్చాయి. ఇక్కడికి రావాల్సిన ఆహార పదార్థాల కాన్వాయ్​ని రష్యా చెక్​ పోస్ట్​ వద్ద అడ్డుకుంది. గత బుధవారం నాటికి బాంబు దాడుల్లో 1,207 మంది పౌరులు చనిపోయినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. సిటీలో మరో 4 లక్షల మంది చిక్కుకుపోయినట్టుగా వెల్లడించారు.

చెర్నోబిల్​ ప్లాంట్ కు మళ్లీ కరెంట్​ కట్

ఉక్రెయిన్​లోని చెర్నోబిల్ న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​కు మరోసారి పవర్ కట్​ అయ్యింది. రష్యా బాంబు దాడుల్లో హై వోల్టేజ్​ పవర్​ లైన్​ దెబ్బతిన్నట్టు గ్రిడ్​ ఆపరేటర్ సోమవారం ప్రకటించారు. బుధవారం జరిపిన బాంబు దాడుల్లోనే ప్లాంట్​కు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అయితే మరమ్మతులు చేసి కరెంట్​ సరఫరాను పునరుద్ధరించారు. మరోసారి రష్యా జరిపిన బాంబు దాడుల్లో హై వోల్టేజ్​ పవర్​ లైన్​ దెబ్బ తింది.  కాగా, ఉక్రెయిన్​పై దాడుల కోసం మిలిటరీ సహాయం అందించాలని చైనాను రష్యా కోరిందని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను చైనా తోసిపుచ్చింది. అమెరికా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందంటూ మండిపడింది.

ప్రాణాలు కోల్పోయిన నిండు గర్భిణి

మరియుపోల్​లోని మెటర్నిటీ హాస్పిటల్​పై బుధవారం రష్యా జరిపిన బాంబు దాడిలో గాయపడిన నిండు గర్భిణీ సోమవారం కన్నుమూసింది. మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా జరిపిన దాడిలో గాయపడిన ఓ గర్భిణిని సహాయక సిబ్బంది కాపాడి, మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే తుంటి భాగం దెబ్బతినడంతో కడుపులోని శిశువు చనిపోయినట్టుగా డాక్టర్లు గుర్తించారు. మృత శిశువును బయటికి తీసేందుకు డాక్టర్లు ప్రయత్నించగా.. ఆ విషయం తెలిసిన బాధితురాలు ‘‘నన్ను కూడా వెంటనే చంపేయండి’’ అంటూ ఏడుస్తూ డాక్టర్లను వేడుకుంది. సిజేరియన్​ చేసి శిశువును బయటకు తీసినా.. శిశువులో ఎలాంటి కదలికా లేదని సర్జన్లు చెప్పారు. ఆ తర్వాత తల్లిని 
కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.