ఉక్రెయిన్​పై అన్ని వైపుల నుంచి మిసైళ్లతో అటాక్

ఉక్రెయిన్​పై అన్ని వైపుల నుంచి మిసైళ్లతో అటాక్

నిలిచిన విద్యుత్, నీటి సరఫరా

బ్లాక్​ సీలో దాడికి ప్రతికారమేనా..?

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా వరుస దాడులతో బీభత్సం సృష్టించింది. దీంతో రాజధాని కీవ్, ఖార్కివ్, ఇంకా ఇతర నగరాల్లో కీలక మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. కీవ్ లో ఓ విద్యుత్ కేంద్రం డ్యామేజ్ కావడంతో 80% జనానికి నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. నీటి సరఫరాను సాధ్యమైనంత త్వరగా రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్చ్ కో చెప్పారు.

ఈలోగా దగ్గర్లోని పంప్ రూంల నుంచి నీటిని తెచ్చిపెట్టుకోవాలని స్థానికులకు చెప్పినట్లు ఆయన టెలిగ్రాం పోస్టులో వెల్లడించారు. కీవ్ లో సోమవారం ఉదయం నగరమంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మిసైల్ దాడి జరగవచ్చని ఎమర్జెన్సీ సర్వీసుల నుంచి జనాలకు మెసేజీలు వచ్చాయి. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ 3 గంటలపాటు సైరన్​లు మోగాయి.

రష్యా దాడుల్లో ఒకరు గాయపడ్డారని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయని కీవ్ రీజియన్ గవర్నర్ ఒలెక్సీ కులేబా తెలిపారు. ఖార్కివ్ లోనూ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా వెల్లడించారు. మిసైల్స్ లాంచ్ చేసి తమ పౌరులను రష్యా గాయపరుస్తోందని, ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని విమర్శించారు. ఉక్రెయిన్ పౌరులను చంపాలన్న కసితోనే రష్యా దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. శత్రు దాడులను ఎదుర్కొనేందుకు ఉత్తర కీవ్ లో భారీగా మిలటరీని మోహరించామని, ఒక డ్రోన్​ను తమ బలగాలు కూల్చివేశాయని తెలిపారు. 

రైళ్లకూ పవర్ కట్

లవీవ్ ప్రాంతంలోనూ దాడులు జరిగాయని దిమిత్రీ పేర్కొన్నారు. రష్యా మిసైళ్లను తాము కూల్చేశామని వివరించారు. జపరోజియా సిటీలో పవర్ కట్​లకు అవకాశం ఉందని వెల్లడించారు. రష్యా దాడుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లకు విద్యుత్ సరఫరా బంద్ అయిందన్నారు. కాగా, మూడు రోజుల కింద బ్లాక్ సీలో తమ స్థావరాలపై జరిగిన దాడికి ప్రతీకారంగానే రష్యా ఈ దాడిచేసినట్లు తెలుస్తోంది. అయితే, తాము ఆ అటాక్ చేయలేదని ఉక్రెయిన్ పేర్కొంది. సామాన్య జనంపై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్  ప్రెసిడెంట్ ఆఫీస్ మండిపడింది.