రష్యా సిటీలో భారీ పేలుడు

రష్యా సిటీలో భారీ పేలుడు
  • బెల్​గ్రాడ్​లోని ఆయుధ డిపో దగ్గర్లో ఘటన
  • ఉక్రెయిన్​ మిసైల్ ​దాడే కారణం!
  • కన్ఫర్మ్​ చేయని అధికారులు
  • ప్రాణనష్టం లేదని వెల్లడి

కీవ్: ఉక్రెయిన్​ బార్డర్​కు దగ్గర్లోని రష్యా సిటీ బెల్​గ్రాడ్​లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, పేలుడుకు కారణమేంటనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అనధికార సమాచారం మేరకు నలుగురు సైనికులు ఈ దాడిలో గాయపడ్డారు. రష్యా ఆయుధ డిపోకు దగ్గర్లోనే ఈ పేలుడు జరగడంతో ఉక్రెయిన్​ మిసైల్​ దాడి చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. పలు ఇంగ్లిష్​ పేపర్లు, న్యూస్​ సైట్లు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఉక్రెయిన్​ బార్డర్​కు బెల్​గ్రాడ్​ సిటీ కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ క్రమంలో మిసైల్​ దాడి అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెప్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వారం కిందట కూడా అక్కడే ఉక్రెయిన్​ సైనికులు విసిరిన బాంబు పేలి ఇద్దరు రష్యన్లు గాయపడ్డారని న్యూయార్క్ టైమ్స్​కథనం పేర్కొంది. ఉక్రెయిన్​ మిసైల్​ దాడి నిజమే అయితే.. యుద్ధం మొదలైనంక రష్యా భూభాగంలో ఉక్రెయిన్​ జరిపిన రెండో దాడి ఇదని డైలీ మెయిల్​ కథనం పేర్కొంది. మిల్లెరోవో ఎయిర్​బేస్​పై ఉక్రెయిన్​ ఫిబ్రవరిలో దాడి చేసిందని తెలిపింది.

బాలిస్టిక్​ మిసైల్​తో దాడి..

ఉక్రెయిన్ జర్నలిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం.. రష్యా ఆయుధ డిపో లక్ష్యంగా ఉక్రెయిన్​ టోచ్కా బాలిస్టిక్​ మిసైల్​ ప్రయోగించింది. 19 వ మిసైల్​ బ్రిగేడ్​ ఈ దాడి చేసింది. అయితే, అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్​  కానీ దీనిపై అధికారికంగా వివరణ ఇవ్వలేదు.