ఇంకిన్ని వెపన్స్​ ఇవ్వండి

ఇంకిన్ని వెపన్స్​ ఇవ్వండి
  • పశ్చిమ దేశాలకు జెలెన్ స్కీ వినతి
  • నాటోకు ఉన్నదాంట్లో 1%  వెపన్స్ చాలు
  • ఫుడ్, ఫ్యూయెల్ డిపోలపైనా రష్యా దాడులు
  • లవీవ్ సిటీపై మిసైల్స్​ ప్రయోగం

కీవ్/మాస్కో: రష్యా రాకెట్ దాడుల నుంచి మరియుపోల్ సిటీని కాపాడుకునేందుకు మరిన్ని వెపన్స్ అందజేయాలని పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ‘‘ఉక్రెయిన్ లోని ఆహార, ఇంధన గోదాములపై రష్యన్ బలగాలు దాడులు పెంచాయి. రష్యన్లను పారదోలేందుకు మరిన్ని యుద్ధట్యాంకులు, విమానాలు, క్షిపణులు కావాలి’’ అని ఆయన శనివారం రాత్రి విడుదల చేసిన వీడియోలో కోరారు. ‘‘రష్యన్ విమానాలను మెషిన్ గన్ లతో పేల్చివేయలేం. నాటో ఏం చేస్తోంది? దానిని రష్యా నడుపుతోందా? ఇప్పటికే 31 రోజులు గడిచిపోయాయి. అయినా, మీరు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? నాటో దేశాల్లో ఉన్న వాటిలో మేం 1% విమానాలు, ట్యాంకులను మాత్రమే అడుగుతున్నాం’’ అని జెలెన్ స్కీ అన్నారు. మరోవైపు తమ దేశంలోని ఏ భూభాగాన్నీ వదులుకోబోమని రష్యాకు స్పష్టంచేశారు. ఇప్పటికైనా యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చర్చలకు రావాలని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​ స్కీ కోరారు.

ఉక్రెయిన్​ను ముక్కలు చేయనివ్వం.. 
ఉత్తర, దక్షిణ కొరియాలను వేరుచేసినట్లుగా ఉక్రెయిన్​ను రెండు ముక్కలు చేయాలని రష్యా ప్రయత్నిస్తోందని ఆదివారం ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆరోపించారు. దేశాన్ని ముక్కలు కాకుండా అడ్డుకునేందుకు పూర్తిస్థాయి గెరిల్లా యుద్ధం చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రజలకు త్వరలోనే ఆహారం, ఇంధనం పంపిణీ చేసేందుకు తాము ఏర్పాట్లు చేస్తుండటంతో రష్యన్ బలగాలు తమ ఫుడ్, ఫ్యూయెల్ డిపోలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ హోంమంత్రి సలహాదారు వదీమ్ డెనిసెంకో చెప్పారు.

లవీవ్ సిటీపైకి ఆరు మిసైల్స్ 
పశ్చిమ ఉక్రెయిన్​లోని లవీవ్ సిటీపై ఆరు క్రూయిజ్ మిసైల్స్​ను ప్రయోగించినట్లు ఆదివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ బలగాలు ఉపయోగించుకుంటున్న ఇంధన డిపోపై దాడి చేసినట్లు వెల్లడించింది. ట్యాంకులు, రాడార్ స్టేషన్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంలను రిపేర్ చేసే కేంద్రంపైనా మిసైల్స్ ను ప్రయోగించినట్లు తెలిపింది. ఉక్రెయిన్​కు చెందిన పలు డ్రోన్​లను కూల్చేసినట్లు తెలిపింది. 

రష్యన్ కర్నల్​ను సొంత సైన్యమే చంపింది
ఉక్రెయిన్​తో యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న రష్యన్ బలగాలు తమ ఆఫీసర్లపై తిరుగుబాటు చేస్తున్నాయి. కీవ్​కు పశ్చిమాన ఉన్న మకరీవ్ సిటీ వద్ద ఏకంగా రష్యన్ కర్నల్ యూరి మెద్వెదెవ్​ను సొంత సోల్జర్లే యుద్ధట్యాంకుతో తొక్కించి చంపినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. మకరీవ్ వద్ద పోరాటంలో రష్యాకు చెందిన 37వ సెపరేట్ గార్డ్స్ కు చెందిన మోటార్ రైఫిల్ బ్రిగేడ్ యుద్ధంలో పాల్గొంది. అయితే, వీరిలో దాదాపు 50 శాతం మంది సోల్జర్లు ఉక్రెయిన్ బలగాల చేతిలో హతమయ్యారు. దీంతో తమకు నాయకత్వం వహిస్తున్న కర్నల్ మెద్వెదెవ్ పై తీవ్ర ఆగ్రహం చెందిన సోల్జర్లు.. ఆయనను ట్యాంకుతో తొక్కించి చంపినట్లు తెలుస్తోంది. మరోవైపు యుద్ధంలో రష్యన్ ఆర్మీకి చెందిన మరో జనరల్ హతమయ్యారు. రష్యా 49వ కంబైన్డ్ ఆర్మ్స్ కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాన్ త్సేవ్ ను ఉక్రెయిన్ బలగాలు హతమార్చాయి. 

బైడెన్ ఉద్దేశం అది కాదు..
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇక ఎంతమాత్రమూ పదవిలో ఉండేందుకు వీలు లేదని, ఆయన కిరాతకుడని శనివారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ చేసిన కామెంట్ల ఉద్దేశం అది కాదంటూ ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వివరణ ఇచ్చారు.

రెఫరెండం పేరుతో రష్యా కుట్ర పన్నుతోంది..
రెబెల్స్ ఆధీనంలో ఉన్న డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రెఫరెండం పెట్టి, తమ దేశంలో కలిపేసుకునేందుకు రష్యా పావులు కదుపుతోందన్న వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ మండిపడింది. రెఫరెండం పెట్టి, తమ భూభాగాన్ని లాగేసుకోవడం అక్రమం అని, దానికి చట్టబద్ధత ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, రష్యాలో చేరేందుకు తాము రెఫరెండానికి సిద్ధంగా ఉన్నామని లుహాన్స్క్ రెబెల్ లీడర్ లియోనిడ్ పషెచ్నిక్ ప్రకటించారు. త్వరలోనే రెఫరెండం పెడతామన్నారు. కాగా, డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో ఏడు దాడులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటించింది.