ఉక్రెయిన్ పై దాడులు తీవ్రం చేసిన రష్యా

ఉక్రెయిన్ పై దాడులు తీవ్రం చేసిన రష్యా
  •     ‘బంకర్ బస్టర్’ బాంబులూ ప్రయోగించింది
  •     టన్నెల్స్​లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పిల్లలు, మహిళలు
  •     డాన్​బాస్​ను రాళ్లదిబ్బగా మార్చాలని చూస్తున్రు: జెలెన్ స్కీ

కీవ్/మాస్కో: దక్షిణ ఉక్రెయిన్ లోని మరియుపోల్ సిటీలో ఉక్రెయిన్ సోల్జర్లకు కంచుకోటలా ఉన్న అజోవ్ స్టీల్ స్టీల్ ప్లాంటు పూర్తిగా నేలమట్టం అయింది. ప్లాంటులోని ప్రతి భవనమూ ధ్వంసం అయింది. కొన్ని భవనాలు నేలమట్టం కాగా.. మరికొన్ని భవనాలకు మొండిగోడలు మాత్రమే మిగిలిన దృశ్యాలు.. శాటిలైట్ ఫొటోల్లో కన్పిస్తున్నాయి. ప్లాంటులోని బిల్డింగులపైనే కాకుండా.. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ను సైతం ధ్వంసం చేసేలా బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు రష్యా వెల్లడించింది. ఇప్పటికీ ప్లాంటులోని టన్నెల్స్ లో వెయ్యి మంది ఉక్రెయిన్ సోల్జర్లు, మరో 2 వేల మంది ఫైటర్లు, ప్రజలు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే, వీరికి తిండి, నీళ్లు అయిపోవచ్చాయని, ప్లాంటులోని జనం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు మరియుపోల్ సిటీలో సుమారు లక్ష మంది చిక్కుకుని ఉన్నారని, వారిని తరలించేందుకు వీలు లేకుండా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. సిటీలోని జనం కూడా తిండి, నీళ్ల కరువుతో అవస్థలు పడతున్నారని తెలిపింది.

సోల్జర్లనూ బయటకు తేవాలె 

స్టీల్ ప్లాంటులో ఉన్న సాధారణ ప్రజలను, డిఫెండర్లను బయటకు తరలిస్తే.. అక్కడి నుంచి పోరాడుతున్న అజోవ్ రెజిమెంట్ కు చెందిన సోల్జర్లను కూడా తీసుకురావాలని ఉక్రెయిన్ మహిళలు కోరుతున్నారు. ‘‘దేశం కోసం డిఫెండర్లుగా పోరాడుతున్న మా భర్తలను, ప్రజలను ప్లాంట్ నుంచి తీసుకురాదలిస్తే.. సోల్జర్లనుకూడా తేవాలి. ఎందుకంటే సైనికుల ప్రాణాలు కూడా ముఖ్యమే” అని మరియుపోల్​ మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

తూర్పున హోరాహోరీ పోరు

ఉక్రెయిన్ లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా దాడుల ను తీవ్రంచేయగా.. తమ బలగాలు దీటుగా అడ్డుకుంటున్నాయని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ప్రధానంగా డోనెట్స్క్ లోని లిమన్, లుహాన్స్క్ లోని సీవిరోడోనెట్స్క్, పపాస్నా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలన్నది రష్యా టార్గెట్ అని, కానీ తమ బలగాలు దీటుగా పోరాడుతున్నాయని తెలిపింది. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో రష్యన్ బలగాల ఆక్రమణ అనుకున్న దానికన్నా నెమ్మదిగా సాగుతోందని అమెరికన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, మరియుపోల్​ను సర్వనాశనం చేసినట్లుగానే డాన్​బాస్ ప్రాంతాన్ని కూడా రాళ్లదిబ్బలా మార్చేయాలని రష్యా చూస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మండిపడ్డారు. డాన్​బాస్​లో ఉన్న వాళ్లందరినీ హతమార్చాలని భావిస్తున్నందునే రష్యా విచ్చలవిడిగా బాంబులేస్తోందని అన్నారు. 

ల్యాండ్ మైన్స్ వెలికితీత పై మహిళలకు శిక్షణ

ఉక్రెయిన్ లో రష్యన్ బలగాలు పాతిపెట్టిన మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించి, డిఫ్యూజ్ చేసేందుకు మహిళలకు కూడా ప్రత్యేకంగా ట్రెయినింగ్ ఇప్పిస్తున్నారు. యుద్ధం తర్వాత ల్యాండ్ మైన్స్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం పలువురు మహిళలను శిక్షణకోసం కొసావోకు పంపింది. ఫేస్ షీల్డ్ పెట్టుకుని, ల్యాండ్ మైన్ డిటెక్టర్ పట్టుకుని తాను ఇలా ల్యాండ్ మైన్ స్క్వాడ్ గా మారతానని అనుకోలేదని ట్రెయినింగ్ కోసం కొసావో వచ్చిన అనస్టేసియా మించుకోవా అనే మహిళ తెలిపారు.

12 లక్షల మందిని తరలించినం: రష్యా 

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఉక్రెయిన్ నుంచి 12 లక్షల మంది ప్రజలను తమ దేశానికి తరలించామని శనివారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోవ్ వెల్లడించారు. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభానికి ముందే రష్యా స్వతంత్ర దేశాలుగా గుర్తించిన డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల నుంచి ఎవాక్యుయేషన్ చేపట్టామని ఆయన తెలిపారు. తమ దేశానికి తరలించిన వారిలో 1.20 లక్షల మంది ఫారినర్లు ఉన్నారని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ లోని 389 మిలిటరీ టార్గెట్లను ఒక్కరాత్రిలోనే ధ్వంసం చేశామని శనివారం రష్యన్ ఆర్మీ ప్రకటించింది. ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన 35 కంట్రోల్ పాయింట్లు, 15 ఆయుధ డిపోలు, బలగాలు, ఎక్విప్ మెంట్లు ఉన్న ఇతర ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు రష్యన్ వార్తా సంస్థ ఇంటర్ ఫ్యాక్స్ వెల్లడించింది. పలు ఆయుధ, ఇంధన డిపోలపై మిసైల్ దాడులు కూడా చేసినట్లు తెలిపింది.