
భోపాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సొంత పార్టీపై ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ ప్రారంభించిన ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’కు తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఆహ్వానం అందినా ఆ యాత్రలో పాల్గొనేదిలేదంటూ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రను చేపట్టింది.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అయితే, ఉమాభారతిని ఈ కార్యక్రమానికి పిలువలేదు. దీనిపై ఉమాభారతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..“జన్ ఆశీర్వాద్ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందలే. ఇప్పుడు ఆహ్వానించినా యాత్రలో పాల్గొనను. సెప్టెంబరు 25న జరిగే యాత్ర ముగింపు వేడుకకు కూడా నేను వెళ్లను. నాకు, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మధ్య విడదీయరాని బలమైన గౌరవ బంధం ఉంది. ఆయన కోరితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను” అని ఉమాభారతి పేర్కొన్నారు.