పాక్​లో పర్యటిస్తున్న యూఎన్​ చీఫ్ గుటెర్రస్​

పాక్​లో పర్యటిస్తున్న యూఎన్​ చీఫ్ గుటెర్రస్​

ఇస్లామాబాద్​: పర్యావరణానికి ఎక్కువ నష్టంచేసిన అభివృద్ధి చెందిన దేశాలను వదిలేసి తక్కువ నష్టం చేసిన పాకిస్తాన్​ లాంటి దేశాలనే ప్రకృతి ఎక్కువ దెబ్బ కొట్టిందని యునైటెడ్​ నేషన్స్(యూఎన్) చీఫ్​ ఆంటోనియో గుటెర్రెస్​ అన్నారు. క్లైమేట్​ చేంజ్​లో పాక్​ పాత్ర చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే వరదలకు తీవ్రంగా ప్రభావితమైన పాకిస్తాన్​లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇస్లామాబాద్​లోని నేషనల్​ ఫ్లడ్​ రెస్పాన్స్​ అండ్​ కోఆర్డినేషన్ సెంటర్​ను ఆ దేశ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​తో కలిసి సందర్శించారు.

అనంతరం గుటెర్రెస్​ మాట్లాడారు. ‘‘ప్రకృతిపై మానవాళి యుద్ధం ప్రకటించింది. దీంతో ప్రకృతి తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. కర్బన ఉద్గారాలను పాకిస్తాన్​ చాలా తక్కువగా విడుదల చేస్తోంది. కానీ క్లైమేట్​ చేంజ్​ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతోంది” అని గుటెర్రెస్​ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించుకోవాలని, వరదలకు అతలాకుతలమైన పాక్​ను ఆదుకోవాలని సూచించారు. పాక్​కు సాయం చేయడం అంతర్జాతీయ సమాజ కనీస బాధ్యత అని అన్నారు. ఇంతకుముందు కూడా పాక్​కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం చేయాలని పాక్​ ప్రధానితో  షెహబాజ్​తో కలిసి అంతర్జాతీయ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.