కశ్మీర్ విషయంలో పాక్ కు మరో ఝలక్

కశ్మీర్ విషయంలో పాక్ కు మరో ఝలక్

జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి గట్టి షాక్ నిచ్చింది. ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ .. ఐక్యరాజ్యసమితిని  ఇరు దేశాల మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. అయితే ఈ విషయం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని, తామేమీ కలుగజేసుకోమని ఐకాస తేల్చి చెప్పింది.

ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఈ విషయంపై మాట్లాడుతూ… పాక్ రాయబారి మలీహా లోధి కాశ్మీర్ వ్యవహరాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ దృష్టికి తీసుకొచ్చారని, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని కోరాడని తెలిపారు. అయితే గుటేరస్  ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు నిరాకరించినట్టుగా తెలిపారు. ఈ అంశం రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా గుటెరస్ అభిప్రాయపడినట్టుగా స్టీఫెన్ ప్రకటించారు.

చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని చీఫ్ ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని  ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో రెండు దేశాలు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని భద్రతా మండలికి పాక్ విదేశాంగ మంత్రి పంపిన లేఖను భద్రతా మండలి సభ్యులకు కూడ పంపినట్టుగా ఆయన తెలిపారు.