
- ఆస్తి మొత్తాన్ని కుమారుడికి ఇవ్వాలంటూ సూసైడ్ నోట్
గచ్చిబౌలి, వెలుగు: భార్య మృతిని తట్టుకోలేక ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ఎంఐజీకి చెందిన తాళ్లూరి రాధా ఫణి ముఖర్జీ(47) మేడ్చల్‌లోని సెయింట్ పీటర్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది కిందట అతడి భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి అతడికొడుకు రేవంత్ గుంటూరులోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. భార్య చనిపోయినప్పటి నుంచి ఫణి ముఖర్జీ డిప్రెషన్‌తో ఉంటున్నాడు.
శుక్రవారం సాయంత్రం నుంచి అతడు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో శనివారం మధ్యాహ్నం స్థానికులు అల్వాల్‌లో ఉండే ఫణిముఖర్జీ సోదరి అవంతికి కాల్ చేసి చెప్పారు. ఆమె ఫణిముఖర్జీ ఇంటికి వచ్చి డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అతడు బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా డబ్బు, ఆస్తి మొత్తం కొడుకు రేవంత్‌కు అప్పగించండి’ అని ఫణిముఖర్జీ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.