
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలు ప్రోత్సాహక నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. నిధుల్లేక ఇబ్బందులు పడుతున్న తమ ఊర్లకు ఈ నిధులు వస్తే కొన్ని సమస్యలైనా తప్పుతాయన్న ఆశతో ఉన్నాయి. సర్కారు నుంచి రూ.10 లక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిన రూ.5 లక్షలు కలిపి.. రూ.15 లక్షలు అందితే పల్లెల్లో పనులు చేసుకోవచ్చని కొత్త సర్పంచులు భావిస్తున్నారు. కానీ ఆరు నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి ఒక్క పైసా కూడా అందలేదు. పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఊర్లలో ఐక్యత పెరుగుతుందని, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయన్న ఉద్దేశంతో సర్కారు ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. దీంతో ఈసారి ఎన్నడూ లేనివిధంగా 2,134 సర్పంచ్, 29,985 వార్డు మెంబర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. కానీ ప్రోత్సాహకం నిధులు ఇచ్చే అంశంపై పాలకులు, అధికారులెవరిలో స్పందన లేదు.
పది లక్షల లెక్కన ఇస్తమని..
2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యికిపైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో 10 వేలకు పైగా జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యేవి అతితక్కువగా ఉండేవి. అయితే ఈసారి ఏ పంచాయతీ అయినా సరే ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఆయా పంచాయతీల్లో అమలవుతున్న పథకాలకు అదనంగా నిధులిస్తామని కూడా పేర్కొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆయా పంచాయతీలకు తమ కోటా నుంచి అదనంగా మరో రూ.5 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలా వచ్చే నిధులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో రెండు వేలకుపైగా ఊర్లలో జనం ఏకగ్రీవంగా సర్పంచులు, వార్డు మెంబర్లను ఎన్నుకున్నారు. ప్రోత్సాహకం నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రామాలకు విడుదల కావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఫండ్స్ కూడా రాలేదు.
నిధుల కొరత వల్లే..?
రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత కారణంగానే ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,134 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. వాటి కోసం సుమారు రూ.210 కోట్లకుపైగా నిధులు అవసరం. ఇప్పటికే రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా చాలా పథకాలకు సరిగా నిధులు అందడం లేదు. రైతు బంధు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్, ఆసరా, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకూ ఇబ్బంది ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏకగ్రీవ పంచాయతీల బ్యాంక్ అకౌంట్లు తదితర వివరాలు సేకరించారు. మరికొన్ని ప్రాంతాల్లోనైతే తమను పలకరించిన వారే లేరని కొత్త సర్పంచ్‌లు వాపోతున్నారు.
సమస్యలతో ఇబ్బంది పడుతున్న పల్లెలు
గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయి. జనాభా తక్కువగా ఉండడం, ఆదాయ వనరులు లేకపోవడం వంటి వాటితో చిన్న పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. వాటికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందే సొమ్మే కీలకం. ఆ నిధులను కూడా జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుండటంతో చిన్న గ్రామాలకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కనీసం స్ట్రీట్ లైట్లు, తాగు నీటి పథకాల కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాల వంటివి ఆగిపోయాయి. ఈ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రూ.5 లక్షలు వస్తాయని చాలా పల్లెలు ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు మెంబర్లను ఎన్నుకున్నాయి. ఆ నిధులు వస్తే కొంత మేర ఇబ్బందులు తప్పుతాయన్న ఆశతో కొత్త సర్పంచులు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
వెంటనే నిధులివ్వాలి..
ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహక నిధుల ఊసే లేదు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫండ్స్ లేక ఇబ్బందులు పడుతున్నం. గ్రామానికి నిధులు వస్తాయన్న ఆశతో.. అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి ఏకగ్రీవ నిధులను వెంటనే విడుదల చేయాలి.
– తేజావత్ సంగీత,
లొంకతండా సర్పంచ్, కామారెడ్డి జిల్లా
ఒక్కపైసా రాలేదు
గ్రామ ప్రజలందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయిన. రూ.పది లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని చెప్పారు. ఒక్క పైసా రాలేదు. దీనిపై ఎలాంటి సమాచారం కూడా లేదు. ఎప్పుడిస్తరో తెలియడం లేదు. నజరానాకు కావల్సిన పత్రాలు కూడా ఎవరూ అడగలేదు. నిధులొస్తే ఊరికి మంచి జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలి.
– సునీతా దేవీదాస్, అంతర్ని సర్పంచ్, నిర్మల్