
మ్యూచువల్ ఫండ్స్ కొన్నాళ్లుగా పాపులర్ అయిన పెట్టుబడి సాధనం. బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు పెరిగిపోతున్నట్లుగానే ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ కూడా జరుగుతోందని రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎవ్వరూ క్లెయిమ్ చేయని డివిడెండ్స్, వెనక్కి తీసుకోని పెట్టుబడుల విలువ ఏకంగా రూ.3వేల 452 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 20 శాతం ఎక్కువ కావటంతో సెబీ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇలా వెనక్కి తీసుకోని పెట్టుబడులు భారీగా పెరిగిపోవటం ఆందోళనకర స్థాయిలకు చేరిందని సెబీ భావిస్తోంది. అయితే ఇది కేవలం పెట్టుబడిదారుల నిర్లక్ష్యం వల్ల మాత్రమే కాదని.. వ్యవస్థలో ఉన్న లోపాలపై దృష్టి పెట్టకపోవటం వల్ల కూడా అని రెగ్యులేటీ సంస్థ చెబుతోంది. ప్రధానంగా ఇన్వెస్టర్లకు సంబంధించిన మెుబైల్ నంబర్, చిరునామాలు పాత డేటా కలిగి ఉండటంతో పెట్టుబడిదారులను చేరుకోవటం కష్టతరంగా మారుతోందని గుర్తించారు. నగరాల్లో ప్రజలు తరచుగా అడ్రస్ మారటంతో పాటు వారి తాజా మెుబైల్, మెయిల్ వివరాలు అప్‌డేట్ చేయకపోవటం కూడా మరో కారణంగా వెల్లడైంది.
అలాగే చాలా సందర్భాల్లో పెట్టుబడి ఫోలియోకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేసి కొత్త వాటితో మ్యాండేట్ ఇవ్వటం, అనేక ఫోలియోలను కలిగి ఉండటం వంటి సమస్యలను కూడా సెబీ ఈ సందర్భంగా గుర్తించింది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవటానికి పెట్టుబడిదారులు.. తమ హోల్డింగ్స్ కన్సాలిడేట్ చేయటంతో పాటు పాన్ ఆధారంగా వారి ఫోలియోలను ప్రస్తుత బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయాలని సూచించింది సెబీ. అలాగే అడ్రస్, మెుబైల్ నంబర్ , మెయిల్ ఐడి మార్పుల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని కూడా హెచ్చరిస్తోంది. ఇది ఇన్వెస్టర్లు మరణించినప్పుడు వారి నామినీలకు డబ్బు చేర్చటానికి వీలవుతుంది.