వ్యవసాయానికి అప్రకటిత కరెంట్​ కోతలు

 వ్యవసాయానికి అప్రకటిత కరెంట్​ కోతలు

నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయానికి అప్రకటిత కరెంట్​ కోతలు మొదలయ్యాయి. జిల్లాల్లో త్రీఫేజ్​కరెంట్​ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అగ్రికల్చర్​సెక్టార్​కు 24 గంటల విద్యుత్​ఇస్తున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి కోతలు పెడుతున్నది. డిమాండ్​కు సరిపడా సప్లయ్​ లేకపోవడంతో చాలా జిల్లాల్లో ప్రస్తుతం 9 గంటలతో సరిపెడుతున్నది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత త్రీఫేజ్​ కరెంట్​ తీసేస్తుండడంతో నారుమళ్లు, పత్తి చేళ్లు తడుపుకోలేకపోతున్నామని రైతులు అంటున్నారు. అటు వానలు లేక, ఇటు పవర్​కట్స్​వల్ల వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదని ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత విద్యుత్​ కోతలను నిరసిస్తూ పలుచోట్ల సబ్​స్టేషన్లను ముట్టడించి నిరసన తెలుపుతున్నారు. ​ 

ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు..!
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరం కావడం, వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నారుమడులు, దుక్కులను తడుపుకునేందుకు పంప్​సెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగుచేసిన రైతులు వర్షం లేకపోవడంతో స్ప్రింక్లర్ల ద్వారా తడిపేందుకు మోటార్లు ఆన్​ చేస్తున్నారు. దీంతో త్రీపేజ్​కరెంట్​కు డిమాండ్​ పెరిగిపోయింది. పొద్దంతా ఎండలు కొడ్తుండడంతో రాత్రిపూట నీళ్లు పారించుకుంటేనే ఉదయం దుక్కులు చేసే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. కానీ, అన్ని జిల్లాల్లో రాత్రి పూట పవర్ కట్స్​ విధిస్తుండడంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతున్నది. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్​ కోత విధిస్తున్నారు. కరెంట్ఉన్నప్పుడు కూడా కనీసం నాలుగు సార్లు ట్రిప్ అవుతున్నదని, నిరంతరాయంగా 4 గంటల పాటు కూడా కరెంట్​ ఉండడంలేదని రైతులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట 8 నుంచి 10 గంటల పాటు త్రీఫేజ్​కోత పెడ్తున్నారు. కరీంనగర్ జిల్లాలో  సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంట్​ ఉండడం లేదు. నారుమళ్ల సీజన్ కావడంతో రాత్రి పూట కనీసం 3, 4 గంటల పాటు త్రీఫేజ్​ కరెంట్​ సప్లయ్​ చేయాలని రైతులు కోరుతున్నా కరెంటోళ్లు పట్టించుకోవడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ డివిజన్ పరిధిలో వేళాపాళా లేకుండా కోతలు విధిస్తున్నారు. మెదక్ జిల్లాలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కోతలు అమలుచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో రోజుకు 5 నుంచి 6 గంటల పాటు కోతలు కామన్​ అయ్యాయి. మహబూబ్​నగర్ జిల్లాలో వ్యవసాయానికి కేవలం 9 గంటల కరెంట్​ ఇస్తున్నారు. ఏ టైమ్​లో ఎక్కడ త్రీఫేజ్​ కరెంట్​ సప్లయ్​ చేయాలో డివిజనల్ ఆఫీసర్లకు పైనుంచి వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇస్తున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో రాత్రి పూట 3 గంటలు, ఉదయం 4 గంటల చొప్పున రోజుకు  7 గంటలు మాత్రమే త్రీఫేజ్​ పవర్ సప్లయ్​ చేస్తున్నారు. కొన్ని చోట్ల 9 గంటల వరకు ఇస్తున్నారు. దీంతో పత్తి రైతులు మొలకలను తడిపేందుకు అవస్థలు పడుతున్నారు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి, గుడ్లనర్వ, కారుకొండ, వసంతాపూర్ గ్రామాలకు మధ్యాహ్నం 3 నుంచి ఉదయం 6 గంటల వరకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదు. ఈ నెల 30 నాటికి త్రీఫేజ్​ కరెంట్ సప్లయ్​ మెరుగు పర్చకుంటే సబ్ స్టేషన్ ముట్టడించి, నిరాహారదీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోత విధిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కొత విధిస్తున్నారు. లోడ్ పెరిగినప్పుడు కోత మరో గంట పొడిగిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలలో సబ్ స్టేషన్లు వారీగా  ఒక్కోవారం ఒక్కోలా పవర్ కట్ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి  12 గంటల వరకు కరెంటు కోత విధిస్తున్నారు. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే త్రీ ఫేజ్ సప్లయ్​ ఉంటున్నది. యాదాద్రి జిల్లాలో పలుచోట్ల రాత్రి పూట కరెంట్​కట్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఏరియాలో లోడ్​ ఎక్కువ ఉందంటూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం లోడ్ ను బట్టి మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి మూడు, నాలుగు గంటలు కట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు గంటలపాటు  కరెంటు తీసేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సోయా, పత్తి సాగు చేస్తున్నారు. వర్షాలు పడకుంటే  స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుందని, కరెంట్​ కోతలు ఉంటే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. 

పెరిగిన డిమాండ్​ 
రాష్ట్రంలో 25.63 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. సహజంగా వేసవిలో విద్యుత్​ డిమాండ్​ఎక్కువ ఉంటుంది. మార్చి నుంచి మే వరకు డొమెస్టిక్​వినియోగం పెరగడమే ఇందుకు కారణం. ఇక ఏప్రిల్​నుంచి పంట కోతలు మొదలైతే జూన్​మొదటి వారం దాకా అగ్రికల్చర్​కు వినియోగించే త్రీఫేజ్​ కరెంట్​కు పెద్దగా డిమాండ్​ ఉండదు. జూన్​ రెండోవారంలో వ్యవసాయ పనులు ప్రారంభమైనా, ఒకవేళ వర్షాలు పడ్తే ఏ సమస్యా ఉండదు. కానీ వారం రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయ విద్యుత్​కు క్రమంగా డిమాండ్​ పెరుగుతున్నది. ఈ నెల ప్రారంభం నుంచి  విద్యుత్‌‌ డిమాండ్‌‌ 8 వేల నుంచి 9 వేల మెగావాట్ల మధ్య ఉంటున్నది. ఈ నెల 23న 8,678 మెగావాట్లుగా ఉంది. రాష్ట్ర విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం 6,215 మెగావాట్లు కాగా.. ఇందులో 3,772 మెగావాట్లు (60.7శాతం) థర్మల్​ విద్యుత్​ ద్వారా, 2443 మెగావాట్లు(39.3శాతం) జల విద్యుత్ కేంద్రాల ద్వారా అందాలి. ప్రస్తుతం జల విద్యుత్​ లేకపోవడంతో థర్మల్ విద్యుతే​దిక్కవుతున్నది. ఇక కేంద్రం నుంచి 2,658 మెగావాట్లు, ప్రైవేట్​నుంచి 5,482 మెగావాట్ల కొనుగోలు చేసుకునే వెసులుబాటు మనకు ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ప్రైవేటుగా కొని, అగ్రికల్చర్​కు ఫ్రీగా 24 గంటల పాటు సప్లయ్​ చేయలేకే కోతలు పెడ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆఫీసర్లు మాత్రం డిమాండ్​కు తగినట్లు సప్లయ్​ చేస్తున్నామని, గురువారం 171.647 యూనిట్లకు గాను 171.647 యూనిట్లు సప్లయ్​ చేశామని చెప్తున్నారు. వర్షాకాలం కావడంతో తమ సిబ్బంది సబ్​స్టేషన్లు, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ఎర్తింగ్  పనులు, కొమ్మలు కొట్టేయడం లాంటి పనులు, లైన్ల మరమ్మతులు చేస్తుండడం వల్లే జిల్లాల్లో పవర్​కట్స్​ఉంటున్నాయని తప్పితే వేరే కారణం కాదని అంటున్నారు. 

పేరుకే 24 గంటల కరెంట్
24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నా సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కరెంటు తీసేస్తున్నారు. వర్షాలు లేక పత్తి మొలకలు రావడంలేదు. రాత్రిపూట నీటి తడి అందిద్దామనుకుంటే కరెంటు ఉండడంలేదు. అటు వర్షాలు లేక, ఇటు కరెంటు సరిగ్గా ఉండక ఆగమైతున్నం.
- దారెడ్డి లక్ష్మారెడ్డి, ఉప్పునుంతల, నాగర్​కర్నూల్​ జిల్లా

తక్లీఫ్​​ అయితున్నది
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకే కరెంట్​ ఉంటున్నది. మధ్య మధ్యలో పోతున్నది. పది రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఆఫీసర్లను అడిగితే పై నుంచి రావడం లేదంటున్నరు. మా ఊరికి చెరువు లేకపోవడంతో బోర్ల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నం. నాకున్న ఆరు ఎకరాల్లో వరి నాట్లు వేసుకునేందుకు తక్లీఫ్​ అయితున్నది. 24 గంటలూ కరెంటు సరఫరా చేయాలి.
- అశోక్ గౌడ్, రైతు, హున్సా, నిజామాబాద్​ జిల్లా

సబ్ స్టేషన్ వద్ద ఎంపీటీసీ నిరసన
కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదని, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని  రైతుల ఫిర్యాదు మేరకు శుక్రవారం  కోహెడ  ఎంపీటీసీ మెంబర్​ స్వరూప వెంకటేశం కోహెడ సబ్ స్టేషన్ కు వెళ్లారు. కరెంట్​ కోతలపై  సబ్ స్టేషన్ ఆపరేటర్ ను అడిగితే..  తమ చేతుల్లో ఏమీ లేదని, ఎల్ఎంఆర్సీ( లోడ్ మానిటరింగ్ సెంటర్)  డైరెక్షన్ లోనే సరఫరా జరుగుతున్నదని, దీని వల్ల విద్యుత్ సరఫరాలో అవాంతరాలు వస్తున్నాయని తెలిపారు. కరెంట్​ కోతల వల్ల   రైతులకు ఇబ్బందులు కలుగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని,  సిద్దిపేట, గజ్వేల్ డివిజన్లకు ఒక నీతి హుస్నాబాద్ డివిజన్ కు మరో నీతిగా వ్యవరిస్తున్నారని  మండిపడుతూ సబ్ స్టేషన్ వద్దనే ఎంపీటీసీ నిరసనకు దిగారు. నిరసన కార్యక్రమంలో రైతులు కేతిరెడ్డి ప్రభాకర్​రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

తగినంత కొనుగోళ్లు చేయకే అప్రకటిత కోతలు..!
దేశంలో మేమే నంబర్‌‌ వన్‌‌, 24గంటలు అన్ని వర్గాలకు కరెంటు సరఫరా చేస్తామంటూ సర్కారు చేసే  ప్రకటనలకు క్షేత్రస్థాయిలో కరెంటు సరఫరాకు భిన్నంగా ఉంటోంది. ఒక వైపు జెన్‌‌కో కరెంటు ఉత్పత్తి రోజు వారిగా ఈనెలలో 53 నుంచి 73 మిలియన్‌‌  యూనిట్లు మించలేదు. యావరేజీగా 60ఎంయూలు మాత్రమే సరఫరా జరుగుతోంది. మిగతా అంతా సెంట్రల్‌‌ జనరేటింగ్‌‌ స్టేషన్ల నుంచి  నేషనల్‌‌ ఎలక్ట్రిసిటీ ఎక్చేంజీ ద్వారా రోజు వారిగా కొనుగోళ్ల  మీదనే ఆధార పడుతోంది. విద్యుత్‌‌ సంస్థల వద్ద నిధులు లేక అవసరమైన కరెంటు కొంటలేరని తెలుస్తోంది. వ్యవసాయ పనులు  క్రమంగా పెరుగుతున్నా  దానికి తగినంత విద్యుత్‌‌ కొనుగోళ్లు లేకనే గ్రామాల్లో కరెంటు అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు.  కరెంటు లేక వ్యవసాయపనులకు  రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కోతలు లేకుండా కరెంటు ఇయ్యాలె
ఇప్పుడు వరి తూకాలు పోస్తున్నరు కాబట్టి కరెంటు కోతలున్నా ఎట్లనో తిప్పలు పడ్తున్నం. కానీ నాట్లు వేసే టైమ్ ల గిట్ల గంటలకు గంటలు కరెంటు కటింగ్ పెడితే తక్లీబ్ అయితది. అప్పటికీ కూడా గిట్లనే ఆరేడు గంటలు త్రీ ఫేజ్ కరెంట్ కట్​ చేస్తే  నాట్లు వేసేతందుకు రైతులు వెనక ముందైతరు.
- బ్యాగరి ఎల్లయ్య, చల్మెడ, మెదక్ జిల్లా