చోటా రాజన్‌‌కు జీవిత ఖైదు.. ముంబై స్పెషల్ ​సీబీఐ కోర్టు తీర్పు

చోటా రాజన్‌‌కు జీవిత ఖైదు.. ముంబై స్పెషల్ ​సీబీఐ కోర్టు తీర్పు

ముంబై :  అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌‌ కు ముంబైలోని స్పెషల్​ సీబీఐ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. 2001లో హోటల్ ఓనర్​ జయశెట్టి హత్య కేసులో కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. మే 4, 2001న దక్షిణ ముంబైలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని శెట్టిని గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతని ఆఫీస్​ ఎదుట కాల్చి చంపారు. హోటల్ మేనేజర్, మరొక ఉద్యోగి షూటర్లలో ఒకరిని వెంబడించి పట్టుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పోలీసులకు లొంగిపోయారు.

ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, శెట్టిపై కాల్పులకు రాజన్ బాధ్యుడని, ఇది అతని ఆదేశాలతోనే జరిగిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ పేర్కొన్నారు. జయశెట్టిని రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని.. నిరాకరించడంతో హత్య చేయించాడని ఆరోపించారు. కాగా, ఐదేండ్ల విచారణ తర్వాత చోటా రాజన్​ను దోషిగా నిర్ధారించిన స్పెషల్​జడ్జి ఏఎం పాటిల్ అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.16 లక్షల ఫైన్​ విధించారు.