కట్టుడు తగ్గింది.. పనులూ పోయినయ్​

కట్టుడు తగ్గింది.. పనులూ పోయినయ్​
  • రెండు దశబ్దాలు టాప్ స్పీడ్​లో నిర్మాణ రంగం
  • ఆరేళ్లుగా స్టేబుల్​గా గ్రోత్ రేట్
  • ఇటు కంపెనీలు, అటు లేబర్లపై ‘నోట్ల రద్దు’ ఎఫెక్ట్
  • వేరే పనులకు మళ్లుతున్న వర్కర్లు
  • తక్కువ రోజుల పని, చాలీచాలని జీతాలు

బాబూ లాల్​కు 62 ఏళ్లు. తాపీ మేస్త్రీ. 1981 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఢిల్లీలో నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. 1990, 2000 దశాబ్దాల్లో నిర్మాణ పనులు జోరుగా సాగేవని, తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడతను. ‘‘పేదరికం వల్లే మాలో చాలా మంది నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు. అప్పట్లో పని ఎక్కువగా ఉండేది. కూలీలు తక్కువ ఉండేవాళ్లు. ఇప్పుడు వర్కర్లు ఎంతో మంది ఉన్నారు. దీంతో పని తగ్గింది. నిరుద్యోగం పెరిగింది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

కన్​స్ట్రక్షన్ సెక్టార్.. రెండు దశాబ్దాలపాటు ఇండియాలో లీడింగ్ జాబ్ క్రియేటర్. ఎంతో మందికి ఉపాధి కల్పించింది. వ్యవసాయం కలిసిరాక సమస్యలు ఎదుర్కొన్న వారికి పని ఇచ్చింది. కానీ రానురాను పరిస్థితి మారుతోంది. గత ఆరేళ్లుగా నిర్మాణ రంగంలో గ్రోత్​ రేట్ ఆగిపోయింది. దీనికి తోడు నోట్ల రద్దు పెద్ద దెబ్బ తీసింది. జాబ్స్ తగ్గాయి. కన్​స్ట్రక్షన్ వర్కర్లలో కొందరు ఇతర పనులవైపు మళ్లుతుంటే, ఇంకొందరు అప్పుడప్పుడు దొరికే కూలితోనే బతుకులీడుస్తున్నారు.

అప్పుడు అలా..

వ్యవసాయ పనులు లేక చాలామంది పట్టణాలు, నగరాలకు వలసలు వచ్చారు. వారంతా నిర్మాణ పనుల్లో కుదురుకున్నారు. 1983లో దేశంలో 3.2 శాతం వర్కర్లు నిర్మాణరంగంలో ఉండగా, 2011–12 నాటికి వారి సంఖ్య 10.6 శాతానికి పెరిగింది. ఆ సమయంలో ప్రతి ఐదుగురు వ్యవసాయేతర వర్కర్లలో ఒకరు కన్​స్ట్రక్షన్ ఫీల్డ్​లో ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో కార్మికుల గ్రోత్​ ఆగిపోయిందని ఎకనామిస్ట్ రవి శ్రీవాస్తవ చెప్పారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లెక్కల ప్రకారం.. 2017-–18లో 5.4 కోట్ల మంది లేబర్లతో గ్రోత్​ రేట్ స్టేబుల్​గా ఉందని చెప్పారు.

ఇప్పుడు ఇలా..

ఓ వైపు ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లు, ఇళ్ల నిర్మాణాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నా.. గత ఆరేళ్లలో నిర్మాణ రంగంలో కేవలం 40 లక్షల జాబ్స్ మాత్రమే కొత్తగా వచ్చాయి. ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘‘గతంలో వ్యవసాయంలో ఎదురుదెబ్బలు తిన్న రైతులు, రైతు కూలీల్లో చాలా మంది నిర్మాణ రంగంలోకి వచ్చారు. వాళ్ల వేతనాలు పెరిగాయి, పని పెరిగింది. పేదరికం కూడా తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రెగ్యులర్, క్యాజువల్ వర్కర్ల వేతనాల రేటు పడిపోయింది” అని ఎకనామిస్ట్ సంతోష్ మల్హోత్రా చెప్పారు. మరోవైపు రియల్ ఎస్టేట్, కన్​స్ట్రక్షన్ సెక్టార్​కు డీమానిటైజేషన్ దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో ఎన్నో ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత నాకు చాలా రోజుల వరకు పని దొరకలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు పని ఉండట్లేదు. నెలలో 15 రోజులు, ఒక్కోసారి 20 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. కొన్నిసార్లు ఆ పని దొరకడం కూడా కష్టమవుతోంది. ఎందుకంటే మా అవసరం తగ్గిపోయింది” అని మేస్ర్తీ బన్వారీలాల్ చెప్పాడు.

తక్కువ జీతం, ఎక్కువ రోజుల పని

చిన్ని చిన్న ప్రాజెక్టుల్లో పని చేసే వర్కర్లకు పెద్ద కార్పొరేట్ ప్రాజెక్టుల కంటే మంచి జీతాలు అందుతున్నాయి. అయితే అవి కొన్ని రోజులే. కానీ కార్పొరేట్ బిల్డింగ్స్​లో పని చేసే వారికి నెలంతా పని దొరుకుంతుంది. కానీ జీతం తక్కువగా ఉంటుంది. పురుషులకు ఒకరోజుకు రూ.300 నుంచి 500 వరకు కూలీ దొరుకుతుంది. ఇదే పని చేస్తున్న మహిళలకు మాత్రం 250 వరకు ఇస్తున్నారు. భార్యభర్తలు కలిసి ఎక్కువగా చిన్న ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. మరోవైపు కంకర, ఇసుక కలపడం, మిక్సింగ్​ను మోయడం వంటి మహిళలు చేసే పనులను ఇప్పుడు మెషీన్లు చేస్తున్నాయి. దీంతో ఆడోళ్లకు పనులు తగ్గిపోతున్నాయి. పెద్ద పెద్ద నిర్మాణ పనుల్లో మహిళలకు పనులే ఇవ్వడం లేదు.

మళ్లుతున్నరు

తక్కువ కూలి, తక్కువ రోజులు పని దొరుకుతుండటంతో చాలా మంది వేరే పనుల వైపు మళ్లిపోతున్నారు. లాలా రామ్ అనే బేల్దారి.. తర్వాత పెయింటింగ్​పనులు చేయడం ప్రారంభించాడు. కొందరు పని చేయడం చూసి, తర్వాత యూట్యూబ్ వీడియోలను అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాడు. తొలుత రోలింగ్ చేసేవాడు, ఇప్పుడు రాస్తున్నాడు. ఇలా రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు సంపాదిస్తున్నాడు.