ఆగస్టులో పెరిగిన నిరుద్యోగిత రేటు

ఆగస్టులో పెరిగిన నిరుద్యోగిత రేటు

న్యూఢిల్లీ:  పట్టణ నిరుద్యోగిత రేటు ఈ ఏడాది ఆగస్టులో 9.6 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఉపాధి కలిగిన వారి సంఖ్య 20 లక్షలు తగ్గి 394.6 మిలియన్లకు చేరుకుంది. దీంతో నిరుద్యోగిత రేటు ఆగస్టులో ఒక సంవత్సరం గరిష్ఠ స్థాయి 8.3 శాతానికి పెరిగింది. ఇదే ఏడాది జూలైలో  నిరుద్యోగం రేటు 6.8 శాతం కాగా  ఉపాధి 397 మిలియన్లు. "పట్టణ నిరుద్యోగిత రేటు సాధారణంగా గ్రామీణ నిరుద్యోగ రేటు కంటే 8 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా 7 శాతం ఉంటుంది. ఆగస్టులో పట్టణ నిరుద్యోగిత రేటు 9.6 శాతానికి పెరిగింది.

గ్రామీణ నిరుద్యోగిత రేటు కూడా 7.7 శాతానికి పెరిగింది" అని సిఎంఐఇ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్  చెప్పారు. అకాల వర్షాలు సాగురంగంపై ప్రభావం చూపాయని వ్యాస్ అన్నారు. గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగం పెరుగుదలకు ఇదే ముఖ్యమైన కారణమని చెప్పారు. పల్లెటూళ్లలో నిరుద్యోగం రేటు జూలైలో 6.1 శాతం నుంచి ఆగస్టులో 7.7 శాతానికి పెరిగింది.   ఉపాధి రేటు 37.6 శాతం నుంచి 37.3 శాతానికి పడిపోయింది.   వర్షాకాలం ముగిసే సమయానికి వ్యవసాయ కార్యకలాపాలు పెరుగుతాయి కాబట్టి గ్రామీణ నిరుద్యోగిత రేటు తగ్గవచ్చని వ్యాస్​ వివరించారు.   రాబోయే నెలల్లో పట్టణ నిరుద్యోగిత రేటు ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పలేమన్నారు.