బావ పొట్టిగా ఉన్నాడని చంపేశాడు.. పెళ్లైన పది రోజులకే చెల్లి బొట్టు చెరిపేశాడు !

బావ పొట్టిగా ఉన్నాడని చంపేశాడు.. పెళ్లైన పది రోజులకే చెల్లి బొట్టు చెరిపేశాడు !

బాపట్ల: ఉమ్మడి గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మునుపెన్నడూ వినని కారణంతో పరువు హత్య జరిగింది. బావ పొట్టిగా ఉన్నాడని బావను బావమరిది చంపేశాడు. పెళ్ళైన 10 రోజులకే వరుడు ఇలా దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన కుర్రా గణేష్‌ తన కుటుంబంతో కలిసి తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం వెళ్లాడు. ఈ రెండు కుటుంబాలకు దూరపు బంధుత్వం కూడా ఉంది.

పెళ్లి చూపులకు ముందు అబ్బాయి ఒడ్డూపొడవు అమ్మాయి కుటుంబానికి తెలియదు. కుర్రా గణేష్ కొంచెం పొట్టిగా ఉంటాడు. ఈ కారణంతో పెళ్లి చూపుల్లో అమ్మాయి తల్లిదండ్రులు ఈ సంబంధం వద్దనుకున్నారు. అయితే పెళ్లిచూపుల్లో అప్పటికే చూసుకున్న గణేష్, కీర్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. 

ఈ రెండు కుటుంబాలకు తెలియకుండా గణేష్, కీర్తి ప్రేమ కథ నడిచింది. పొట్టిగా ఉన్నాడనే కారణంతో పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోక పోయినా అది పెద్ద కారణం కాదని, పెళ్లి చేసుకుంటే వాళ్లే అర్థం చేసుకుంటారని గణేష్, కీర్తి ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి, అబ్బాయి వరసయిన వాళ్లే కావడం, దూరపు బంధువులే కావడంతో ఈ ఇద్దరి ప్రేమ పెళ్లి తరువాత పరిణామాల గురించి ఈ ప్రేమికులు ఎక్కువ ఆలోచించలేదు. ఎంత చెప్పి చూసినా పెద్దలు వీళ్ల ఒప్పుకోకపోవడంతో 10 రోజుల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోయి అమరావతి గుడిలో గణేష్, కీర్తి పెళ్లి చేసుకున్నారు. ఈ పరిణామంతో కీర్తి సోదరుడు దుర్గారావు ఆవేశంతో రగిలిపోయాడు. 

పొట్టిగా ఉన్నాడని పెళ్లి వద్దనుకుంటే.. మాయ మాటలు చెప్పి తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడని గణేష్పై పగ పెంచుకున్నాడు. గణేష్ అంతు చూస్తానని, ఇద్దరూ ఎలా కలిసి బతుకుతారో చూస్తానని బెదిరించాడు. ఈ వార్నింగ్తో హడలిపోయిన ఈ ప్రేమ జంట ప్రాణ హాని ఉందని నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కూడా ఈ ప్రేమ జంటకు రక్షణ కల్పించారు. అయితే.. పెళ్లి గుడిలో చేసుకున్న గణేష్ ఇంటి దగ్గర రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బుతో ఇంటికి తిరిగి వెళుతుండగా గణేష్ బావమరిది దుర్గారావు అతనిపై దాడి చేశాడు. 

నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. బావను చంపేసి చెల్లి బొట్టు చెరిపేశాడు. గణేష్, కీర్తి పెళ్లి జరిగిన పది రోజులకే ఇంత ఘోరం జరగడంతో కీర్తి కుప్పకూలిపోయింది. దుర్గారావును, ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన బావ పొట్టిగా ఉన్నాడని, తన చెల్లికి ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకున్నాడని.. అందుకే చంపానని పోలీసుల విచారణలో దుర్గారావు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.