ఈ సారి స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందుడు కష్టమే 

ఈ సారి స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందుడు కష్టమే 

హైదరాబాద్, వెలుగు: సరిగ్గా మరో నెల రోజుల్లో బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 13 నుంచి సర్కార్ స్కూళ్లు తెరుచుకోనున్నాయి. కానీ ఆ టైమ్ కల్లా స్టూడెంట్లకు స్కూల్ డ్రెస్సులు అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పేద పిల్లలు పాత బట్టలతోనే బడి బాట పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. నిజానికి బడులు ప్రారంభించే నాటికే స్టూడెంట్లకు స్కూల్ డ్రెస్సులు అందించాల్సి ఉంది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, యూనిఫామ్స్ కు కావాల్సిన క్లాత్ కోసం తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో)కు ఆలస్యంగా ఆర్డర్ ఇవ్వడంతో ఈ దుస్థితి తలెత్తింది. రాష్ట్రంలో 25 వేల స్కూళ్లలో 20 లక్షల మందికి పైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఎయిడెడ్ స్కూళ్లలో మరో 3 లక్షల మందికి పైగా ఉన్నారు. వీళ్లందరికీ సర్కార్ ఏటా రెండు జతల స్కూల్ డ్రెస్సులు అందజేస్తుంది. దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్లకు1.42 కోట్ల మీటర్ల క్లాత్ అవసరమని అధికారులు అంచనా వేశారు. దీని కోసం టెస్కోకు నెల కింద ఆర్డర్ ఇచ్చారు. వాస్తవానికి జనవరిలోనే టెస్కోకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు నిర్లక్ష్యంతో ఆర్డర్ ఇవ్వడమే మరిచిపోయారు. ఫలితంగా స్టూడెంట్లకు సకాలంలో బడి బట్టలు అందడం కష్టంగా మారింది. 
 

పంద్రాగస్టుకూ పాత బట్టలే... 
స్టూడెంట్ల యూనిఫామ్ కోసం అవసరమైన బట్ట తయారు చేసేందుకు కనీసం నాలుగు నెలలు పడుతుంది. ప్రస్తుతం1.42 కోట్ల మీటర్ల క్లాత్ అవసరం కాగా, టెస్కో పోయినేడు తయారు చేసిన 50 లక్షల మీటర్లు రెడీగా ఉంది. అంటే మరో 90 లక్షల మీటర్లు తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం టెస్కో సిరిసిల్లలోని సహకార సంఘాలకు తయారీ ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. వారు నూలు కొనుగోలు చేసి, బట్ట తయారు చేసేందుకు కనీసం మూడు, నాలుగు నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాతే జిల్లాలకు  క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి బడులకు చేరి.. పిల్లల కొలతలు తీసుకొని కుట్టుడు పూర్తయ్యే సరికి మరో నెల నుంచి రెండు నెలలు పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఆగస్టు15 నాటికి కూడా కొత్త బట్టలు అందడం కష్టంగానే కనిపిస్తోంది. 
 

యూనిఫామ్ మారుతోంది.. 
ఈ విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్ల యూనిఫామ్ కలర్ మార్చాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న పింక్ అండ్ బ్లూ కాంబినేషన్​స్థానంలో బ్రౌన్ చెక్స్, రెడ్ చెక్స్ కలర్​లో యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తోంది. అయితే గతేడాది పెండింగ్​లో ఉన్న 50 లక్షల మీటర్ల క్లాత్​ను ఎవరికి ఇవ్వాలనే దానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త యూనిఫామ్ ను ముందుగా మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు ఇచ్చే అవకాశం ఉంది. 


పోయినేడు యూనిఫామ్ ఇచ్చినట్టు దొంగ లెక్కలు.. 
కరోనా పేరుతో 2021–22 విద్యా సంవత్సరంలో స్టూడెంట్లకు యూనిఫామ్ ఇవ్వలేదు. ప్రభుత్వం ముందు టెస్కోకు ఆర్డర్ ఇచ్చి, ఆ తర్వాత రద్దు చేసింది. అయితే ఆర్డర్ రద్దు చేసే నాటికే 40 శాతం క్లాత్ తయారైంది. దాన్ని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తీసుకోలేదు. కానీ పిల్లలకు స్కూల్ డ్రెస్సులు ఇచ్చినట్టు కాగితాలపై దొంగ లెక్కలు ఎక్కించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,19,219 మంది స్టూడెంట్లకు యూనిఫామ్ ఇచ్చినట్టు ఏకంగా అసెంబ్లీకే తప్పుడు లెక్కలు ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ పుస్తకాల్లోనూ పేర్కొన్నారు. ఇవే లెక్కలు కేంద్రానికీ ఇచ్చినట్టు సమాచారం.