న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టిస్తున్న నీట్-యూజీ పరీక్ష రద్దు వ్యవహారంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌనం వహించింది. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.
కనీసం మీడియావైపు కూడా చూడకుండా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షల్లో ఇలాంటి లోపాలు పదేపదే జరగడం దురదృష్టకరమని మండిపడ్డారు.
సీబీఐ విచారణ అనేది కేవలం కాలయాపన కోసమేనని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఎన్టీఏ పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిందని, దీని వెనుక దేశవ్యాప్త సిండికేట్ లేదా మాఫియా నెట్‌వర్క్ పనిచేస్తోందని ఆరోపించారు.
