ఇన్​ఫ్లేషన్ ​కట్టడే నా లక్ష్యం: నిర్మల సీతారామన్

ఇన్​ఫ్లేషన్ ​కట్టడే నా లక్ష్యం:  నిర్మల సీతారామన్
  • త్వరలో ఇండియా-యూకే ఎఫ్​టీఏ

న్యూఢిల్లీ: నిలకడైన ఆర్థిక వృద్ధి కోసం ఇన్​ఫ్లేషన్​(ధరల భారం)ను కట్టడి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు.   కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న బీ20 సమ్మిట్ ఇండియాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఈ నెలలో విడుదల చేయబోయే మొదటి క్వార్టర్​కు జీడీపీ సంఖ్యలు బాగుంటాయని అన్నారు. పెరిగిన వడ్డీ రేట్లు రికవరీకి  ఆటంకం కలిగిస్తాయని, తన ప్రాధాన్యం ఇన్​ఫ్లేషన్​ను అదుపు చేయడమేనని అన్నారు. 

రిటైల్ ఇన్​ఫ్లేషన్​ జులైలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ప్రధానంగా టమాటాలు,  కూరగాయల ధరల పెరుగుదల కారణంగా ఇది ఎగిసింది. వృద్ధి కోసం తమ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసిందని చెప్పారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆగస్టు 31న మొదటి క్వార్టర్​కు సంబంధించిన జీడీపీ సంఖ్యలను విడుదల చేయనుంది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూలధన వ్యయం కోసం ప్రభుత్వం భారీగా కేటాయింపులు జరపడం వల్ల ప్రైవేట్ మూలధన వ్యయం పెరుగుతోందని సీతారామన్ అన్నారు. క్లైమేట్ ఫైనాన్సింగ్ గురించి,  విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల గురించి కూడా ఆమె వివరించారు.  

ఆర్థిక వృద్ధికి అవి కీలకమని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. ఇండియా–యూకే ఫ్రీ ట్రేడ్​అగ్రిమెంట్​(ఎఫ్​ఏటీ) త్వరలోనే ఖరారవుతుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్‌‌ గురించి యూరోపియన్​ ఎఫ్​ఏటీ సహా  పలు దేశాలతో ఇండియా సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. యూకేతో 2022 నుంచి ఫ్రీ ట్రేడ్​అగ్రిమెంట్​పై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఇదిలా ఉంటే కరోనా, రష్యా–ఉక్రెయిన్​ ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడే కోలుకుంటున్నదని, రాబోయే సంవత్సరంలో గ్లోబల్​ ఎకనమిక్​  రికవరీ కీలకం అవుతుందని కామెంట్​ చేశారు. చాలా దేశాలు కరోనా షాక్​ నుంచి బయటికి రాగలిగాయని, ఇప్పుడు ఎకానమీలను గాడిన పెట్టేందుకు కష్టపడుతున్నాయని చెప్పారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పులు, గ్రీన్​ఫ్యూయల్స్ ​కూడా అన్ని దేశాలకూ కీలకంగా మారాయని వివరించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఇండియా ఎకానమీ అత్యంత వేగంగా ఎదుగుతున్నదని ప్రశంసించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. 

ఇండియా వృద్ధి ప్రపంచానికి కీలకం : చంద్రశేఖరన్​

భారతదేశ వృద్ధి ప్రయాణం ప్రపంచ భవిష్యత్తును రూపొందిస్తుందని ఈ సందర్భంగా బీ20 ఇండియా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు. రాబోయే దశాబ్దంలో 7 శాతం సగటు వృద్ధిని సాధిస్తుందని చెప్పారు.  మూడు రోజులపాటు జరిగే బీ20 సమిట్​ ప్రారంభించిన అనంతరం టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ   బీ20 దేశాలతో కలిసి పనిచేయడానికి గ్లోబల్ బీ20 ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది భారతదేశంలో గ్లోబల్ బిజినెస్ ఇన్​స్టిట్యూట్ అవుతుందని చంద్రశేఖరన్ అన్నారు. చంద్రయాన్​–3 సక్సెస్​మన దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మనం ఏమి సాధించగలమనే దానికి ఇది సంకేతమని కామెంట్​ చేశారు. ఎంఎస్​ఎంఈల గురించి మాట్లాడుతూ అన్ని దేశాలలో వీటిని ప్రోత్సహించడానికి,  అవసరమైన ఆర్థిక మద్దతు అవసరమని అన్నారు. చంద్రశేఖర్​ ఈ ఏడాది బీ20 ఇండియాకు చైర్​పర్సన్​గా వ్యవహరిస్తున్నారు. జీ20 ప్రెసిడెన్సీ బీ20 చైర్మన్​ను ఎంపిక చేస్తుందనే విషయం తెలిసిందే.