కేసీఆర్​ సర్కారు అసమర్థత వల్ల పథకం అమలైతలే

కేసీఆర్​ సర్కారు అసమర్థత వల్ల పథకం అమలైతలే
  • 20 వేల కోట్లతో మత్స్యశాఖ ఏర్పాటు చేసినం
  • మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తం
  • కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మంత్రి పురుషోత్తం వెల్లడి
  • కేంద్ర పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు

నిర్మల్/నర్సాపూర్(జి) : మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్​సీడీసీ (నేషనల్​ కోఆపరేటివ్​ డెవలెప్​మెంట్​ కార్పొరేషన్) పథకానికి సంబంధించిన నిధులు రాష్ట్రంలో దుర్వినియోగమయ్యాయని, ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థత కారణంగా సద్వినియోగం చేసుకోలేకపోయిందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. ఆదివారం నిర్మల్  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి ముందుగా నర్సాపూర్ జి మండల కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా మంత్రి మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్డులతో మత్స్యకారులు ష్యూరిటీ లేని రుణాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. జన్ ధన్  యోజన లాగా కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు మరిన్ని పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తున్నదని, దీంతో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడిందన్నారు. బీజేపీ కార్యకర్తలంతా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పీఎం జీవన్ జ్యోతి, సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల గ్యాస్, టాయిలెట్లు లాంటి పథకాలపై ప్రచారం చేపట్టాలన్నారు. అలాగే బూత్​స్థాయి నుంచీ సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

కొయ్యబొమ్మల కేంద్రం, వేయి ఉరుల స్తూపం సందర్శన
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. ఇక్కడ తయారవుతున్న కొయ్యబొమ్మల వివరాలను కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కురన్నపేట్ ఎల్లపెళ్లి రోడ్డు మధ్యలో గల వేయిఉరుల మర్రి అమరుల స్తూపాన్ని ఆయన సందర్శించి నివాళి అర్పించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, జిల్లా ఇన్ చార్జి మహేశ్, పార్టీ లీడర్లు రావుల రామనాథ్, భూమయ్య, తదితరులు ఉన్నారు.