రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వానం పంపాం : కేంద్రం

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వానం పంపాం : కేంద్రం

ఢిల్లీ :  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ పార్టీ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ విడుదల చేశారు. కార్యక్రమ ఆహ్వాన లేఖను సీఎం ముఖ్య కార్యదర్శికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో స్వయంగా వెళ్లి ఇచ్చారని ఆయన తెలిపారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 12న రామగుండం పట్టణానికి రానున్నారు. ఆ రోజున నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైనును అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా మోడీ రామగుండం వేదికగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.