విభజన సమస్యలపై 8న మీటింగ్

విభజన సమస్యలపై 8న మీటింగ్

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న విభజన తగవులను తేల్చుదాం రమ్మంటూ రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం -2014లోని అపరిష్కృత అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో ఆగస్టు 8న ఎనిమిది పాయింట్ల ఎజెండాతో సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం పది రోజుల కింద రెండు  ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ మేరకు, ఢిల్లీలో నార్త్‌ బ్లాక్‌ లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఆగస్టు 8న మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అధికారుల భేటీ జరుగనుంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఏపీ భవన్, ఆప్మేల్, డిస్కంలకు బకాయిలు, ఫైనాన్స్​కార్పొరేషన్, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, తదితర సమస్యలపై వివాదం కొనసాగుతోంది.

ఏపీ భవన్.. ఎటు?

ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు. 2018లో ఏపీ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు పెట్టగా తెలంగాణ వాటిని పట్టించుకోలేదు. ఏపీ భవన్‌ నిజాం వారసత్వ సంపద అని, ఆ ఆస్తి తెలంగాణకే చెందుతుందని వాదిస్తోంది.

ఆప్మేల్.. వీడని పీటముడి

సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మేల్‌ (ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్) విభజన పీటముడిలా మారింది. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఈ సంస్థను 58-:42 నిష్పత్తిలో విభజించాలని ఏపీ వాదిస్తోంది. సింగరేణి పెట్టుబడి 85% ఉన్న సంస్థలో ఏపీ వాటా కోరడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే న్యాయపోరాటానికి సిద్ధమని  తెలంగాణ ప్రకటించింది. ఈ సంస్థ విభజనపై అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ న్యాయ సలహా కోరింది.

డిస్కంలు.. బకాయిల చిక్కుముడి

తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు డిస్కంలకు రూ.5,732 కోట్లు బకాయిలున్నాయని, వాటిని చెల్లించేలా మధ్యవర్తిత్వం చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖను కోరింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరింది. ఏపీ వాదన తప్పని, తెలంగాణాకే రూ.2,405 కోట్లు రావాల్సి ఉందని ఇక్కడి అధికారులు వాదిస్తున్నారు. త్వరలో జరుగనున్న సమావేశంలోనూ ఇదే విషయాన్ని తేల్చి చెప్పాలని నిర్ణయించారు.

ఫైనాన్స్​కార్పొరేషన్​పై కేంద్రానిదే నిర్ణయం

స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజనపైనా చిక్కుముడి ఏర్పడింది. 9వ షెడ్యూల్‌లోని సెక్షన్‌ 70 ప్రకారం సంస్థ రద్దుకాని, దాని పునర్నిర్మాణం, కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు, ప్రస్తుత కార్పొరేషన్‌ ఆస్తులు, హక్కులు, అప్పుల పంపకాలపై కార్పొరేషన్‌ బోర్డు మీటింగ్​లో నిర్ణయం తీసుకొని కేంద్రానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన ప్రతిపాదనను సెంట్రల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ఇచ్చింది.  ఆ సంస్థ ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది మొదట్లో తమ ప్రతిపాదనను గుర్తు చేస్తూ రిమైండర్‌ కూడా పంపింది. ఆ సంస్థ నిర్ణయం మేరకే కార్పొరేషన్‌ విభజనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.