RukminiVasanth: అందంగా, ముద్దుగా, సాఫ్ట్గా ఉంటేనే ఫీల్ ఉండదు.. హీరోయిన్ అంటే ఇలా కూడా ఉండాలి!

RukminiVasanth: అందంగా, ముద్దుగా, సాఫ్ట్గా ఉంటేనే ఫీల్ ఉండదు.. హీరోయిన్ అంటే ఇలా కూడా ఉండాలి!

రుక్మిణీ వసంత్.. ఈ పేరు తెలుగు ఇండస్ట్రీకి ఇప్పటికైతే కొత్త కావొచ్చు. కానీ, రాబోయే ప్రాజెక్ట్​లతో ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపించబోతుంది. చూడ్డానికి క్యూట్​గా, సాఫ్ట్​గా కనిపిస్తున్న ఈ కన్నడ అమ్మాయి.. ‘సప్తసాగరదాచే ఎల్లో’ అనే సినిమాతో ఆడియెన్స్​ మనసు కొల్లగొట్టింది. ఆ సినిమా మిగతా భాషల్లోనూ డబ్బింగ్ అవ్వడంతో అక్కడి ఆడియెన్స్​ను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘కాంతార : చాప్టర్​ 1’లో నటిస్తోన్న రుక్మిణీ.. మొన్ననే ‘మదరాసి’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పలకరించింది.

రుక్మిణీ వసంత్ బెంగళూరులో పుట్టింది. తండ్రి వసంత్ వేణుగోపాల్, ఆర్మీ ఆఫీసర్. అశోక చక్ర అవార్డు పొందిన మొదటి కన్నడిగుడు. తల్లి సుభాషిణి, భరతనాట్యం డాన్సర్​. రుక్మిణి ఆర్మీ స్కూల్లో చదువుకుంది. లండన్​లోని బ్లూమ్స్​ బెర్రీలో రాయల్ అకాడమీ ఆఫ్​ డ్రమాటిక్ ఆర్ట్స్​లో యాక్టింగ్​లో డిగ్రీ పూర్తి చేసింది.

రుక్మిణి 2019లో బీర్బల్​ ట్రయాలజీ అనే కన్నడ సినిమాలో నటించింది. 2023లో రక్షిత్​ శెట్టి హీరోగా నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో – సైడ్​ ఎ’ సినిమాలో హీరోయిన్​గా నటించింది. ఆ సినిమా సీక్వెల్ కూడా వచ్చింది. ఆ రెండు సినిమాలతో రుక్మిణి సక్సెస్​ సాధించింది. దాంతోపాటు.. కన్నడలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీల్లోనూ గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత ‘భగీరా’, ‘భైరతి రణగల్’ తెలుగులో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ వంటి సినిమాల్లో కనిపించింది. ఈ ఏడాది ‘ఏస్’, ‘మదరాసి’ సినిమాల్లో నటించింది. ‘కాంతార’ ప్రీక్వెల్​గా వస్తున్న ‘కాంతార : చాప్టర్​ 1’, యష్ ‘టాక్సిక్​ : ఎ ఫెయిరీ టేల్ ఫర్​ గ్రోన్​ అప్స్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వంటి సినిమాల్లో కనిపించబోతుంది. తన జర్నీ ఆమె మాటల్లోనే..

పదిహేనేండ్లకే..

నాకు పదిహేనేండ్ల వయసున్నప్పుడు ఒకరోజు నా రూమ్​లో కూర్చుని, మా అమ్మతో ‘‘మా.. నా లైఫ్​ని నేను వేస్ట్ చేసుకుంటున్నా. దయచేసి నన్ను థియేటర్ క్లాసుల్లో చేర్పించు” అని అడిగా. అలా నా జర్నీకి పునాదిపడింది. తర్వాత నేను క్లాసికల్ డాన్స్​లో శిక్షణ తీసుకున్నా. డాన్స్​లో రకరకాల ఎమోషన్స్ చూపిస్తాం. కానీ, ఎవరికైనా అవి అర్థం కాకపోతే ఎమోషన్​ రీచ్ అవ్వదు.

అందుకే నాకు మాటలతో చెప్పే మన భావాన్ని చెప్పాలనిపించేది. అదే స్టేజీ మీద మాటలతో ఎమోషన్స్​ ఎక్స్​ప్రెస్ చేస్తే డైరెక్ట్​గా కమ్యూనికేట్​ చేయొచ్చు అనిపించేది. అందుకే నేను థియేటర్ క్లాసుల్లో చేరాలనుకున్నా. తర్వాత లండన్​లో యాక్టింగ్​ స్కూల్లో చేరి పూర్తిగా నేర్చుకున్నా. అక్కడ నేను నాటకాలతోపాటు, మ్యూజికల్ థియేటర్, సినిమా గురించి కూడా నేర్చుకున్నా. తిరిగి ఇండియా వచ్చాక సినిమానే కెరీర్​గా ఎంచుకున్నా. 

యావరేజ్​ స్టూడెంట్

చిన్నప్పటి నుంచి అకడమిక్స్​లో యావరేజ్​ స్టూడెంట్​ని. నాకు కళలంటే చాలా ఇష్టం. చాలామంది నాతో చెప్పేవాళ్లు.. ‘‘నువ్వు దీనికోసమే పుట్టావు”అని. నా గోల్ యాక్టింగ్ అయినప్పటికీ మొదట మోడలింగ్​లో ట్రై చేశా. అప్పుడు ఒక కో – ఆర్డినేటర్​కి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పా. దాంతో తనకు తెలిసిన ఆడిషన్స్ గురించి చెప్పాడు. నేను ఆడిషన్​కి వెళ్లి, సెలక్ట్ కావడంతో ఆ అవకాశం దక్కింది. నేను సెలక్ట్ అయ్యానని తెలియగానే చాలా సంతోషమేసింది. టెన్షన్​ కూడా ఉండేది. నేను వెతుకుతున్న దారిలో మొదటి అడుగు వేశా అనిపించింది. నా మొదటి సినిమా పేరు ‘బీర్బల్ ట్రయాలజీ’. 

కాంతారలో.. 

సప్తసాగరదాచే ఎల్లో సైడ్​ ఎ, సైడ్​ బి సినిమాలతో నాకు గుర్తింపుతోపాటు అవకాశాలు కూడా వచ్చాయి. వాటిలో ఒకటి కాంతార. ఆ సినిమాల ప్రొడ్యూసర్, హీరో అయిన రక్షిత్ శెట్టి, కాంతార డైరెక్టర్, హీరో రిషబ్​ శెట్టి బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన ప్రీమియర్స్​కి వచ్చాడు. అలా మా సినిమా చూసి అందులో నా యాక్టింగ్ నచ్చడంతో తను చేసే కాంతారలోనూ నటించేందుకు అవకాశం ఇచ్చాడు. కానీ, ఇదేం అంత త్వరగా జరగలేదు. కాంతారలో నన్ను ఫైనల్ చేశారు అనే వార్త వినడానికి ఒక సంవత్సరకాలం పట్టింది. ఏదయితేనేం మొత్తానికి అంత పెద్ద ప్రాజెక్ట్​లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా, ఎగ్జయిటింగ్​గా ఉన్నా.

ఈ సినిమా కర్నాటకలోని తీరప్రాంతానికి, అక్కడి కల్చర్​తో ముడిపడి ఉంటుంది. నేను కర్నాటక అమ్మాయినే అయినా కోస్టల్ కల్చర్ నాకూ కొత్తే. అందువల్ల ఈ సినిమాలో నటించడం నాకు ఎడ్యుకేషనల్, స్పిరుచ్యువల్ జర్నీలా ఉంది. అంతేకాదు.. కాంతార పెద్ద హిట్ అయిన తర్వాత దానికి కంటిన్యూషన్​గా వస్తోన్న ఫిల్మ్ అనేటప్పటికీ చాలా ఒత్తిడి ఉంటుంది ఎవరికైనా. నాకూ ఉంది.. ఈ సినిమాలో నాకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. నాకు అయితే చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్​గా అనిపించింది.

ఇందులో మేం నిజమైన ఆయుధాల్లాంటివే వాడాం. నేను చాలా విషయాలు నేర్చుకున్నా. హీరోయిన్ అంటే అందంగా, ముద్దుగా, సాఫ్ట్​గా ఉంటుందనే ఫీల్​ ఉండదు. ఈ సినిమాలో నేను చాలా స్ట్రాంగ్​ విమెన్​గా కనిపిస్తా. నేనైతే ఆ ఎక్స్​పీరియెన్స్ అస్సలు మర్చిపోలేను. 

అదే సక్సెస్..

ఒక యాక్టర్​గా చూసే ఆడియెన్స్​ మనసును తాకేలా నటించగలిగితే అదే పెద్ద రివార్డ్. అది నాకు ‘సప్తసాగరదాచే ఎల్లో’ సినిమాలతో దక్కింది. ఆ సినిమా తర్వాత ఎక్కడ చూసినా చాలామంది తమ బ్రేకప్​ స్టోరీస్ నాతో షేర్ చేసుకునేవాళ్లు. అవన్నీ విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యేదాన్ని​.

అమ్మ.. నాకోసం.. నాన్న కోసం:

మా నాన్న ఒక యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 2008లో మా అమ్మ, నేను, చెల్లి రిపబ్లిక్​ డే సెలబ్రేషన్స్​కు ఢిల్లీ వెళ్లాం. అప్పుడు మా నాన్నకు వచ్చిన ‘అశోక చక్ర’ అవార్డుని అమ్మ అందుకుంది. మా నాన్న చనిపోయిన మూడు నెలలకే తనలా భర్తను కోల్పోయిన ఆడవాళ్ల కోసం వీర్​ రత్న పేరుతో ఫౌండేషన్​ పెట్టింది. తద్వారా చదువుకునే పిల్లలకు స్కాలర్​షిప్స్ అందిస్తోంది. అలాగే నాకు మా ఇంట్లో మా అమ్మ చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ, మరోవైపు ఆర్మీ, క్లాసికల్ డాన్స్ బ్యాక్​గ్రౌండ్ పెట్టుకుని సినిమాలంటే అసలు మనకు కనెక్షన్​ లేదు కదా.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్​ కంటే ఫెయిల్యూర్​ ఎక్కువగా ఉంటుందని, పైగా నేను ఇంక అవన్నీ తట్టుకునే ఏజ్ కాదని కంగారుపడేది. ఏ తల్లికైనా తన కూతురి లైఫ్​ మీద ఉండే భయాలే అవి. కానీ, ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. తన వర్క్​తోపాటు నా కెరీర్, నా చెల్లి స్టడీస్ గురించి కేర్ తీసుకుంటుంది. మా గ్రాండ్ పేరెంట్స్​ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. కొన్నిసార్లు నాతో పాటు సెట్​కు వస్తారు. నిజంగా నాకు నా ఫ్యామిలీ బలంగా ఉంది అని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది.