మూసీని ప్రక్షాళన చేస్తం : అమిత్​ షా

మూసీని ప్రక్షాళన చేస్తం : అమిత్​  షా
  • భువనగిరి కోటను డెవలప్​ చేస్తం       
  • కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

యాదాద్రి, వెలుగు: కాలుష్యంతో నిండిపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​  షా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా రాయగిరిలో బీజేపీ ఆదివారం నిర్వహించిన ‘సకల జనుల విజయ సంకల్ప సభ’కు చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి, జగద్గురు శంకరాచార్యను స్మరించుకొని  మాట్లాడారు. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న భువనగిరి కోటను కేసీఆర్​ సర్కార్​ డెవలప్​ చేయలేదన్నారు. 

కోట డెవలప్​మెంట్​ కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.  అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్​ను గద్దె దించి  బీజేపీ భువనగిరి, ఆలేరు అభ్యర్థులు గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్​ను గెలిపించాలని కోరారు.  

హామీ నిలబెట్టుకోకుంటే రాజీనామా 

తాను గెలిచిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఈ మేరకు బాండ్​ పేపర్​ రాసిస్తానని  భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి ప్రకటించారు.  నియోజకవర్గ రైతులకు నష్టం చేస్తున్న ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ను మార్పిస్తానని ,  ఐటీ హబ్​ ఏర్పాటు చేయించి  ప్రత్యక్షంగా 30 వేల మందికి , పరోక్షంగా మరో 70 వేల మందికి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గెలవగానే ఫస్ట్​ డిగ్రీ కాలేజీ మంజూరు చేయిస్తానని , తన సొంత నిధులతో బిల్డింగ్​ నిర్మిస్తానని  తెలిపారు. 

పోటీ పరీక్షలకు రెడీగా ఉండే వారి కోసం కోచింగ్​ సెంటర్​ ఏర్పాటు చేసి.. రెగ్యులర్​గా కోచింగ్​ ఇప్పిస్తానని మాటిచ్చారు. జిల్లా హెడ్​ క్వార్టర్​ నుంచి మండలానికి అక్కడి నుంచి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పిస్తానన్నారు. మూసీ కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, తాను గెలవగానే మూసీ ప్రక్షాళన కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు తాను సొంతంగా రూపొందించుకున్న మేనిఫెస్టో కచ్చితంగా అమలు చేస్తానని చెప్పారు. 

ఆలేరును అభివృద్ధి చేస్తా

ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని,  సాగు, తాగు నీరు అందిస్తానని బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్​  ప్రకటించారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత విస్మరించిన గంధమల్ల రిజర్వాయర్​ సాధిస్తానని మాటిచ్చారు.  బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని మండిపడ్డారు. తనకు అవకాశం ఇస్తే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. 

నియోజకవర్గ సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం  అమిత్​ షాను ఘనంగా సన్మానించారు.