
- దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం ముఖ్యం
- అఖిల భారత స్పీకర్ల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పాక్షికమైన వేదిక కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చాలా ముఖ్యమన్నారు. బ్రిటిష్పాలనలో 1924లో ఏర్పాటైన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొదటి స్పీకర్‌గా సర్దార్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ ఎన్నికై వందేండ్లు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల అఖిల భారత స్పీకర్ల కాన్ఫరెన్స్ ను అమిత్ షా ప్రారంభించారు.
కాన్ఫరెన్స్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, 29 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 17 మంది డిప్యూటీ స్పీకర్లు, ఆరు రాష్ట్రాల శాసన మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, కేంద్ర, ఢిల్లీ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు.. ఏపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విఠల్ భాయ్ పటేల్, పార్లమెంటరీ సంస్థల పరిణామానికి సంబంధించిన అరుదైన ఆర్కైవల్ రికార్డులు, ఛాయాచిత్రాలు, పత్రాల స్పెషల్ ఎగ్జిబిషన్ ను అమిత్ షా ప్రారంభించారు. విఠల్ భాయ్ జీవితం ఆధారంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ ఆలోచనల ఆధారంగా దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి విఠల్ భాయ్ పటేల్ పునాది వేశారని అన్నారు. సభ, స్పీకర్ పదవి గౌరవాన్ని పెంపొందించాలని, సభ సజావుగా సాగేలా చూసే బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉంటుందన్నారు. దేశ చరిత్రలో అసెంబ్లీలు గౌరవాన్ని కోల్పోయినప్పుడల్లా, భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు.
సభలు పని చేయకపోతే.. ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం: రిజిజు
సభా నిర్వహణలో ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి స్పీకర్ల కాన్ఫరెన్స్ ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీ కేంద్ర బిందువులని, రెండూ సరిగ్గా పనిచేయకపోతే, ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ‘‘పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు సజావుగా పనిచేయడం చాలా ముఖ్యం. వ్యతిరేకత, అడ్డంకి మధ్య తేడా ఉంది.
నిరసన అనేది ప్రతిపక్ష సభ్యుల హక్కు. కానీ వారు సభకు అంతరాయం కలిగించరాదు” అని చెప్పారు. ఏఐ టూల్స్ వంటి డిజిటల్ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించడం, చట్టాల నిర్మాణంలో పారదర్శకత, సామర్థ్యాలను పెంపొందించడం, చట్ట సభల పనితీరు మెరుగుపర్చుకునేందుకు కొత్త విధానాలను అన్వేషించడమే ఈ కాన్ఫరెన్స్ లక్ష్యమన్నారు.