
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల వరకూ తెలంగాణకు విముక్తి లభించలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ పరాక్రమం వల్లే నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయటపడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ ఆదివాసులు మొదట బ్రిటిషర్లు, ఆ తర్వా నిజాంలతో పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విమోచన దినోత్సవ శుభాకాంక్షాలు తెలియజేస్తున్నానన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం అరాచకపాలన సంకెళ్లు తెగి తెలంగాణకు విముక్తి లభించి, భారత్‌లో భాగమైందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చేయలేకపోతోందని అమిత్ షా ప్రశ్నించారు. అప్పుడిచ్చిన వాగ్దానం ఇప్పుడేమైందని, సీఎం కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నామని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని అమిత్ షా చెప్పారు. తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు.