అమిత్ షా పర్యటనతో స్పీడప్​ అయిన పార్టీ కార్యక్రమాలు

అమిత్ షా పర్యటనతో స్పీడప్​ అయిన పార్టీ కార్యక్రమాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.  పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఏ రోజుకారోజు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎప్పుడూ జనంలోనే ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన సూచిస్తున్నారు. ప్రధానంగా హైకమాండ్ ఆదేశించిన ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలు, ‘పార్లమెంటరీ ప్రవాసీ’ యోజన ప్రోగ్రామ్ కింద రాష్ట్రానికి కేంద్ర మంత్రుల టూర్లు, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలపై అమిత్ షా దృష్టి సారించారు. ఈ ప్రోగ్రామ్స్ ఏ రోజు.. ఏ జిల్లాలో కొనసాగుతున్నాయి..? దానికి పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఎవరెవరు హాజరవుతున్నారు.. అని రాష్ట్ర శాఖ నుంచి రిపోర్టులు కోరుతున్నారు. 

కార్యక్రమాలు స్పీడప్​

ఈ నెల 17 న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. ఆ ప్రోగ్రామ్ అనంతరం బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. అందులో కూడా రాష్ట్రంలో పార్టీ తరఫున కొనసాగుతున్న కార్యక్రమాల తీరుపై సమీక్షించి.. మరింత దూసుకుపోవాలని ఆదేశించారు. అమిత్ షాతో భేటీ అయిన రెండు  రోజులకే ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ తరఫున కన్వీనర్లను, కో కన్వీనర్ల నియామకం జరిగింది. ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ ప్రోగ్రామ్ కూడా స్పీడప్ అయింది. గత రెండు రోజులుగా ముఖ్య నేతలంతా బైక్ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగియనుండగా.. ముగింపు సభను గ్రాండ్ గా నిర్వహించాలని హైకమాండ్ ఆదేశించడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దానిపై దృష్టి పెట్టింది.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు..

పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రోగ్రాములు కొనసాగేలా చూస్తూ ఎక్కువ సంఖ్యలో జనాన్ని కలువాలని, దీంతో రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందనేది ఢిల్లీ పెద్దల ఆలోచన. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఇటు బండి సంజయ్ పాదయాత్ర, అటు నియోజకవర్గాల్లో పార్టీ పరమైన కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్ర నేతలకు  హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. పైగా కేంద్ర హోం మంత్రి అమిత్ షానే వీటిని దగ్గరుండి చూస్తున్నారు. అమిత్​ షా హైదరాబాద్ మీటింగ్​ ఎఫెక్ట్​తో పార్టీ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని లీడర్లలో చర్చ 
జరుగుతున్నది.

రేపటి నుంచి మళ్లీ పార్లమెంటరీ ప్రవాసీ

పార్లమెంటరీ ప్రవాసీ యోజన కింద ఒక్కో కేంద్ర మంత్రి రాష్ట్రంలోని వారికి కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు బస చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి.  ఇప్పటికే 9 నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు బస చేసి వెళ్లారు. ఇందులో నిర్మలా సీతారామన్, జ్యోతిరాధిత్య సింధియా,  పురుషోత్తం రూపాలాతో పాటు మరి కొందరు ఉన్నారు. మళ్లీ శుక్రవారం నుంచి మరికొందరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో బస చేసేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, ఈ నెల 23, 24 తేదీల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు.