కేసీఆర్ ​దిగిపో..  నీకు క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు: అమిత్​ షా

కేసీఆర్ ​దిగిపో..  నీకు క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు: అమిత్​ షా
  • కేసీఆర్​దిగిపో..  నీకు క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు: అమిత్​ షా
  • పేపర్ల లీకేజీతో లక్షల మంది యువత బతుకులు బర్బాద్​ చేసినవ్​
  • ప్రధాని పదవి కోసం కలలు కనుడు ఆపి.. 
  • రాష్ట్రంలో మీ పార్టీ సంగతి చూసుకో 
  • జైళ్లకు, లాఠీలకు మా కార్యకర్తలు భయపడరు
  • బీఆర్ఎస్​ కారు స్టీరింగ్​ మజ్లిస్ చేతిలో ఉంది
  • పోలీస్ వ్యవస్థను కూడా పొలిటిసైజ్​ చేసిండు
  • అన్ని ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డరు 
  • రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే.. 
  • అవినీతిపరులను జైలుకు పంపుతాం
  • ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి.. 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తం
  • దేశమంతా చూసేలా విమోచన 
  • దినోత్సవాన్ని పరేడ్​ గ్రౌండ్​లో జరుపుతం
  • చేవెళ్ల సభలో కేంద్ర హోం మంత్రి ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీతో లక్షల మంది యువత బతుకులను కేసీఆర్​ బర్బాద్​ చేశారని, ఆయనకు సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా ఉండే అర్హత లేదని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. ‘‘టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చి ప్రధాని పదవి కోసం కేసీఆర్​ కలలు కంటున్నడు. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఇదే చెప్తున్నడు. కానీ, ప్రధాని సీటు ఖాళీగా లేదనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి. దేశం సంగతి తర్వాత.. ముందు రాష్ట్రంలో బీఆర్​ఎస్​ సంగతి ఏంది? ఆ పార్టీ పనైపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే” అని తెలిపారు. కేసీఆర్​ పాలనలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, అవన్నీ కేసీఆర్​ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకే చేరాయని ఆరోపించారు. ఈ అవినీతి సర్కారును కూకటివేళ్లతో పెకిలించి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతిపరులను జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. పార్లమెంట్​ప్రవాస్​యోజనలో భాగంగా ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్​ షా మాట్లాడారు. కేసీఆర్, బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

టెన్త్​ పేపర్లు, టీఎస్​పీఎస్సీ పేపర్లను లీక్​ చేసి  లక్షల మంది యువతీయువకుల భవిష్యత్తును కేసీఆర్​ ఆగం చేశారని అమిత్​ షా అన్నారు. 2 లక్షల దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తొమ్మిదేండ్లు నాన్చుతూ వచ్చిన కేసీఆర్​.. ఇప్పుడు  ఎన్నికల టైమ్​ వచ్చిందని హడావుడిగా 80వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నించి, లీకేజీలు చేసి నిరుద్యోగుల బతుకులను ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​కు గుణపాఠం చెప్పేందుకు యూత్​ రెడీగా ఉన్నారని తెలిపారు. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై కేసీఆర్​ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. లీకేజీపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 

నీ జులుం బంజేయ్​

జైళ్లకు, లాఠీ దెబ్బలకు బీజేపీ కార్యకర్తలు భ యపడబోరని అమిత్​ షా తెలిపారు. ‘‘బండి సంజయ్​ని కేసీఆర్​ జైల్లో పెట్టిచ్చిండు.. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను జైళ్లకు పంపిండు..కేసులు పెట్టిండు. కేసీఆర్... జాగ్రత్తగా విను.. మా కార్యకర్తలు నీ బెదిరింపులకు భయపడరు.. నిన్ను గద్దె దించే వరకూ నిద్రపోరు. పోరాడుతూనే ఉంటారు.  నీ జులుం బంజేయ్​” అని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అణచివేస్తున్నా రని, అసెంబ్లీకి రాకుండా ఈటల రాజేందర్​ను ఇబ్బంది పెట్టాలని చూశారని తెలిపారు. రాష్ట్రంలో  పోలీస్ ​వ్యవస్థతోపాటు అన్ని వ్యవస్థలను పొలిటిసైజ్​ చేశారని, కుటుంబ పాలన సాగుతున్నదని మండిపడ్డారు. 

వచ్చేది బీజేపీ సర్కారే

కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా కేసీఆర్​ అడ్డుపడుతున్నారని అమిత్​ షా అన్నారు. నిధులను దారి మళ్లిస్తున్నారని, దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని ప్రాజెక్టుల్లో కేసీఆర్​ సర్కారు అవినీతికి పాల్పడుతున్నదని, ప్రాజెక్టులను ఏటీఎంలుగా మార్చుకున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో నేషనల్​హైవేల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. హైదరాబాద్​ –-- బీజాపూర్ నేషనల్​హైవే పనులు కేసీఆర్​ భూమి సేకరించి ఇవ్వకపోవడంతో ఐదేండ్లుగా ఆలస్యమవుతున్నాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం నుంచి మోడీ రూపాయి పంపిస్తే.. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం ఇంకో 25 పైసలు కలిపి ప్రజలకు ఇస్తుందని చెప్పారు. తెలంగాణకు మోడీ మెగా టెక్స్​టైల్​ పార్క్​ ఇచ్చారని, బొల్లారం –- ఉందానగర్ మధ్య ఎంఎంటీఎస్​రెండో లైన్ పనులు ప్రారంభించామని వివరించారు. ‘‘కేసీఆర్​ ఎంతనైనా చెయ్​.. కానీ, మోడీ నుంచి రాష్ట్ర ప్రజలను దూరం చేయలేవ్​. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే” అని ఆయన అన్నారు. 2024లో మళ్లీ మోడీనే ప్రధాని అవుతారని, కేంద్రంలో ఫుల్​ సినిమా చూసే ముందు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ట్రైలర్​ చూపిస్తామని కేసీఆర్​కు సవాల్​ చేశారు. 

బసవన్నకు ప్రణామం

ప్రసంగానికి ముందు సభలో బసవేశ్వరుడి విగ్రహానికి అమిత్​ షా పూలమాల వేసి నివాళులర్పించారు. ‘‘జగత్ జ్యోతి బసవన్నకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్న.. చిలుకూరు బాలాజీ, లక్ష్మీనర్సింహస్వామికి నమస్కరిస్తున్న..” అంటూ ప్రసంగం కొనసాగించారు. ఉమ్మడి ఏపీ తొలి డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డికి, పద్మభూషణ్​ అవార్డు గ్రహీత గులాం అలీ ఖాన్​కు ప్రణామం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్​చుగ్,  ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఒవైసీ ఎజెండాను అమలు చేస్తున్నడు

రాష్ట్రంలో ఒవైసీ ఎజెండాను కేసీఆర్​ అమలు చేస్తున్నారని, మజ్లిస్​ చెప్పినట్లు నడుచుకుంటున్నారని అమిత్​ షా దుయ్యబట్టారు. ‘‘మజ్లిస్​ చేతుల్లో బీఆర్ఎస్​ కారు స్టీరింగ్ ఉంది. అలాంటి కారు సర్కారు అవసరమా? కమలాన్ని గెలిపించండి.. కమలంలో మహాలక్ష్మి ఉంటుంది..  వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓ టు వేస్తే తెలంగాణకు మహాలక్ష్మీ వైభవాన్ని తీసుకువస్తాం’’ అని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్, ఒవైసీ సర్కారును కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేసి, వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తామని అమిత్​ షా చెప్పారు. మజ్లిస్​కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్​ అధికారికంగా నిర్వహించడం లేదని, సర్దార్​వల్లబ్​భాయ్​ పటేల్ వల్ల నిజాం పాలన నుంచి ఈ గడ్డకు విముక్తి లభించిందని తెలిపారు. మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే.. దేశం మొత్తం చూసేలా పరేడ్​ గ్రౌండ్​లో విమోచన దినోత్సవాలను జరుపుతామని హామీ ఇచ్చారు. ‘‘యువతపై లాఠీ చార్జీ చేసినోళ్లను.. మా పార్టీ నేతలను జైళ్లో పెట్టినవాళ్లను ఉపేక్షించబోం.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరులందరినీ జైల్లో వేస్తాం..” అని ఆయన హెచ్చరించారు. కేసీ ఆర్​ సర్కార్​కు  దిగిపోయే టైమ్​ దగ్గరపడిందని, ఈ మిగిలిన సమయాన్నైనా ప్రజల కోసం కేటాయించాలని, ఒవైసీ కోసం కాదని అమిత్​ షా అన్నారు.

రాష్ట్రంలో పోలీస్​వ్యవస్థతోపాటు అన్ని వ్యవస్థలను కేసీఆర్​ పొలిటిసైజ్​ చేసిండు. కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్నడు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నడు. జైళ్లలో పెడ్తున్నడు. జైళ్లకు, లాఠీల దెబ్బలకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. కేసీఆర్​.. జాగ్రత్తగా విను. నీ అవినీతి సర్కార్​ను గద్దె దించే వరకు మా కార్యకర్తలు పోరాడుతూనే ఉంటరు. 
నీ జులుం బంజెయ్.

- కేంద్ర హోం మంత్రి అమిత్​ షా