ఇండియా కూటమిది విద్వేష దుకాణం: అనురాగ్ ఠాకూర్

ఇండియా కూటమిది విద్వేష దుకాణం: అనురాగ్ ఠాకూర్
  • ప్రతిపక్షాల నిరసనలు అర్థరహితం
  • మోదీ గ్యారంటీల్నే జనం నమ్ముతున్నరు
  • కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక ఇమ్మెచ్యూర్(పరిపక్వతలేని), అప్రజాస్వామిక నాయకుడని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ప్రజలను ఫూల్స్ చేసే రోజులు పోయాయని అన్నారు. వారి నిరసనలు అర్థరహితమని విమర్శించారు. ఇప్పుడు దేశ ప్రజలంతా ప్రధాని మోదీ గ్యారంటీలనే నమ్ముతున్నారని అన్నారు. 

‘‘పార్లమెంట్​లో కీలకమైన బిల్లులపై చర్చలో ఇండియా కూటమి పార్టీలు పాల్గొనకుండా రాద్ధాంతం చేశాయి. ఇటీవలి ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీల నేతలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. రాహుల్ ఒక ఇమ్మెచ్యూర్, అన్ డెమోక్రటిక్ లీడర్” అని ఠాకూర్ ఫైర్ అయ్యారు. రాహుల్ తరచూ తమది ‘మొహబ్బత్ కీ దుకాణ్(ప్రేమ దుకాణం)’ అంటుంటారని, కానీ ఉపరాష్ట్రపతి ధన్​ఖడ్​ను బాడీ షేమింగ్ చేస్తూ అవమానించడం ద్వారా వారు తమది ‘నఫ్రత్ కీ దుకాణ్ (విద్వేష దుకాణం)’ అని చాటుకున్నారని విమర్శించారు. ఒడిశా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 350 కోట్లు దొరికిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ‘అవినీతి దుకాణం’లా కూడా మారిపోయిందని ఎద్దేవా చేశారు.