బీఆర్ఎస్ అవినీతి వల్లే చెక్డ్యామ్లు కొట్టుకపోతున్నయ్ : బండి సంజయ్

బీఆర్ఎస్ అవినీతి వల్లే చెక్డ్యామ్లు కొట్టుకపోతున్నయ్ :  బండి సంజయ్
  • కేంద్రమంత్రి బండి సంజయ్​ ఆరోపణ

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేయడం వల్లే అప్పుడు కట్టిన చెక్ డ్యామ్ లు ఇప్పుడు కూలిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  ఆరోపించారు. బీఆర్ఎస్  పాలనలో చెక్ డ్యాంలను నిర్మించిన కాంట్రాక్టర్లు కాంగ్రెస్  వాళ్లేనని విమర్శించారు.

 ఆనాడు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని తనుగుల వెళ్లారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాసిరకం చెక్ డ్యాంల నిర్మాణం, అనేక చోట్ల చెక్ డ్యాంల ధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 

‘రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణం పేరుతోనూ భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు అనేక వార్తా కథనాలు, అరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో నిర్మించిన చెక్ డ్యాంల పరిస్థితి దారుణంగా తయారైంది. నాసిరకం పనులతో నిర్మించడం వల్ల ఇప్పటికే చాలా చోట్ల చెక్ డ్యాంలు కూలిపోయాయి.  తాజాగా కరీంనగర్  జిల్లా జమ్మికుంట మండలం తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైంది. 2021 లో వచ్చిన వరదల్లోనూ చాలా వరకు కూలిపోయాయి. డిజైన్  లోపం, నాణ్యత సరిగా లేని కారణంగా ప్రజాధనం నీటిపాలైంది.

 చెక్ డ్యాంల నిర్మాణ పనులపై  ప్రజలు అనేక సందేహాలు లేవనెత్తుతూ అనేక ఫిర్యాదులు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపుపై ఈ ఏడాది మే నెలలో మీరే స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై 57 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.287 కోట్లు చెల్లించిన దాని మీద మీరు విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారు.  ఆ విజిలెన్స్ విచారణ ఏమైందో నేటి వరకు అతీగతీ లేదు.' అని లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.