కేటీఆర్‌ను జైల్లో వేస్తడు.. సీఎం రేవంత్​పై నమ్మకముంది: బండి సంజయ్

కేటీఆర్‌ను జైల్లో వేస్తడు.. సీఎం రేవంత్​పై నమ్మకముంది: బండి సంజయ్
  • కేటీఆర్ చేసిన అవినీతి, అరాచకాలు అందరికీ తెలుసు 
  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చర్చలు ఫేక్ న్యూస్  
  • ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు 
  • పార్టీ విలీనమని ప్రచారం చేస్తున్నరని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు జైలు తప్పదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది. కాకపోతే దానికి కొంత సమయం పట్టొచ్చు” అని చెప్పారు. ‘‘నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా కార్యకర్తలను కేటీఆర్ హింసించాడు.. జైల్లో వేయించాడు. 

కేటీఆర్ ను లోపల వేయకుంటే కాంగ్రెస్ కు గడ్డుకాలమే. అలా జరగకుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమవుతుంది. అప్పుడు రేవంత్ సర్కార్ పై ప్రజల్లో నమ్మకం పోతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని క్లారిటీ వస్తే.. ఆ రెండు పార్టీలు మాపై యుద్ధానికి వస్తాయి. వాళ్లను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సంజయ్ చిట్ చాట్ చేశారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యూరప్ టూర్​కు పంపుతున్నరు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధమని సంజయ్ చెప్పారు. అదంతా మీడియా సృష్టేనని.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి. ఆ పార్టీ ఔట్ డేటెడ్ అయింది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు.

 బీఆర్ఎస్​నేతలు ఢిల్లీకి వచ్చేది కవితను కలవడం కోసమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు బయటకు వెళ్తే, పార్టీ వీడుతున్నారనే అనుమానంతో బీజేపీలో బీఆర్ఎస్​విలీనం అని మాట్లాడుతున్నారు. బీజేపీలో విలీనం అంటే ఎమ్మెల్యేలంతా పార్టీ వీడకుండా ఉంటారని అలా చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు వాళ్లను యూరప్‌‌ టూర్ కు పంపిస్తున్నారు. 

వారిని అక్కడికి కాకుండా బంగ్లాదేశ్ పంపిస్తే బాగుంటుంది. అక్కడ హిందువులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వారికి తెలుస్తుంది” అని అన్నారు. కవిత బెయిల్ అంశం ప్రభుత్వం చేతిలో లేదని, అలా ప్రభుత్వం చేతిలో ఉంటే.. ఇక కోర్టులు ఎందుకు? అని ప్రశ్నించారు. 

కేటీఆర్​ ఎన్ని కంపెనీలు తెచ్చిండు?

‘‘గతంలో కేటీఆర్ సూటు, బూటు వేసుకుని విదేశాల్లో తిరిగాడు. అప్పుడు ఎన్ని కంపెనీలు తెలంగాణకు వచ్చాయి? ఎందరికి ఉద్యోగాలు వచ్చాయో? ఆయన సమాధానం చెప్పాలి” అని సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘ఇప్పుడు రేవంత్ కూడా విదేశాలకు వెళ్లారు. కానీ ఆయన తన తమ్ముడి కోసమే వెళ్లారనడం సరికాదు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా ఉండాలి” అని అన్నారు. ‘‘కాంగ్రెస్ లో లుకలుకలు మొదలైనయ్. 

వాళ్లు ఐదేండ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? లేదా? అన్నది వాళ్ల చేతుల్లోనే ఉంది. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదు” అని చెప్పారు. ‘‘అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటి వరకు ఎన్ని వక్ఫ్ భూములు కాపాడారో సమాధానం చెప్పాలి. ఒక గ్రామం మొత్తం వక్ఫ్ భూమి అంటే ఎలా? కొన్నిచోట్ల ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. వక్ఫ్ భూములను బీఆర్ఎస్ పార్టీనే కబ్జా చేసింది. కొందరు ముస్లిం మత పెద్దలు కబ్జాదారులకు కొమ్ముకాశారు” అని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ..  

బీఆర్ఎస్ హయాంలో కొంతమంది అధికారులు కల్వకుంట్ల ఫ్యామిలీకి కొమ్ముకాశారని సంజయ్ ఆరోపించారు. నిజాయతీగా పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్​లకే మళ్లీ మంచి పోస్టింగ్​లు ఇస్తున్నారని.. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు తేడా లేదని విమర్శించారు. కాంగ్రెస్ భూముల కొనుగోలు కోసం ఒక లీడర్ ను పెట్టిందని ఆరోపించారు. 

‘‘అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో మా పార్టీ పుంజుకుంటుంది. పంచాయతీలకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. అందుకే అందరు మాకే సపోర్ట్ ఇస్తరు’’ అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. బీజేపీలో ఎమ్మెల్యేలకు, పార్టీకి మధ్య గ్యాప్ ఉందనడం సరికాదన్నారు. తాను సామాన్య కార్యకర్తనని, పార్టీ ఎవరిని స్టేట్ ప్రెసిడెంట్ చేసినా పని చేస్తానని చెప్పారు.