రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే
  • బీజేపీలో చేరేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 
  • జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, ఇతర నేతలు​
  • కేసీఆర్​ నియంతృత్వ పాలన సాగదు: తరుణ్ చుగ్
  • నిజమైన తెలంగాణవాదులకు బీజేపీ వేదిక: బండి సంజయ్


న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర  ప్రధాన్  ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలో బీజేపీ బలంగా ఉందన్నారు. తెలంగాణ నుంచి పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సోమవారం మాజీ మంత్రి ఈటల రాజేందర్​ బీజేపీలో చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్​తోపాటు పలువురు లీడర్లు టీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్​ రాథోడ్,  ఉమ్మడి కరీంనగర్​ మాజీ జడ్పీ 
చైర్​పర్సన్ తుల ఉమ ఇతర సీనియర్​ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్​ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేసేందుకు తెలంగాణ నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారని, వారికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.  

బీజేపీలో చేరేందుకు చాలా మంది రెడీగా ఉన్నారని తరుణ్​ చుగ్​ అన్నారు.  కరోనా నిబంధనల వల్ల  కొద్దిమంది మాత్రమే ప్రస్తుతం ఢిల్లీ వేదికగా పార్టీలో చేరారని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పార్టీలో చేరికలు మొదలయ్యాయని చెప్పారు. కేసీఆర్  నియంతృత్వ పాలన ఇక సాగదని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీలో, ఏడేండ్ల ప్రభుత్వంలో ఈటల రాజేందర్ నెంబర్  టు గా ఉన్నారని, కానీ, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ చేరారని తెలిపారు. 

కలిసికట్టుగా ముందుకు సాగుదాం:  సంజయ్

నియంత, గడీల పాలనను కాషాయ జెండాతో బద్దలు కొట్టాలనే నిర్ణయాన్ని ఈటల తీసుకున్నారని బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. పార్టీలోకి ఈటలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఈటల చేస్తున్న పోరాటంలో ఆయనకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు.  

బీజేపీలోకి 250 మంది

సోమవారం ఉదయం 250 మంది లీడర్లతో కలిసి ఈటల ఢిల్లీకి వచ్చారు. వారి వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ముందుగా ఢిల్లీలో  బండి సంజయ్ నివాసంలో ఆయనతో ఈటల భేటీ అయ్యారు. తర్వాత  బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఈటల, ఇతర నేతలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ సభ్యత్వం అందజేసి పార్టీ కండువా కప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ఇన్​చార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బండి సంజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, మధ్య ప్రదేశ్ ఇన్​చార్జ్ మురళీ ధర్ రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్​, సోయం బాపురావు, పార్లమెంటరీ పార్టీ ఆఫీసు సెక్రటరీ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.  తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లి ఆయన సమక్షంలో ఈటల​తోపాటు ఇతర లీడర్లు పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఇంట్లో ఈటల మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరినవారిలో  నేతలు అందె బాబయ్య, గండ్ర నళిని, అంజి రెడ్డి, కేశవ రెడ్డి, చంద్ర శేఖర్, ఆర్టీసీ నేత అశ్వత్థామ రెడ్డి, ఓయూ స్టూడెంట్ నేతలు సురేశ్​ యాదవ్, సంతోష్ ముదిరాజ్, మేడి రమణ, రాస వెంకట్​తో పాటు 250 మంది వరకు ఉన్నారు.

అవినీతి పాలనపై పోరు: తరుణ్ చుగ్

తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అధికారంలోకి వస్తామని బీజేపీ స్టేట్  ఇన్​చార్జ్  తరుణ్ చుగ్ అన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. 

గడీల పాలనను బద్దలు కొడ్తం

నా మొత్తం ఆస్తులతోపాటు  కేసీఆర్ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. ఎవరి దగ్గర అక్రమాస్తులున్నాయో తేల్చాలి. తాను చేసిందే చట్టం, తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా కేసీఆర్​  వ్యవహరిస్తున్నరు. గడీల పాలనను బద్ధలు కొడ్తం. తెలంగాణ ఉద్యమకారుల్ని, ప్రజా ప్రతినిధుల్ని బీజేపీ జెండా కిందికి తెచ్చి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం సర్వశక్తులొడ్డి శ్రమిస్తా. 
- ఈటల రాజేందర్