పేదల సంక్షేమం కోసమే వికసిత్​ భారత్ : మహేంద్రనాథ్ పాండే

పేదల సంక్షేమం కోసమే వికసిత్​ భారత్ : మహేంద్రనాథ్ పాండే
  • కేంద్ర మంత్రి డాక్టర్  మహేంద్రనాథ్ పాండే

కందనూలు, వెలుగు : వికసిత్​ భారత్  సంకల్ప్ యాత్ర పేదల సంక్షేమం, ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్  మహేంద్రనాథ్  పాండే  పేర్కొన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కర్ పేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ‘మోదీకి గ్యారంటీ’పై చర్చ జరుగుతోందన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరమైనా, నాగర్ కర్నూల్ లోని చిన్న గ్రామమైనా ఈ స్కీమ్​ చేరుతోందన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు.

ఎయిమ్స్ లాంటి అత్యున్నతమైన వైద్య సదుపాయాలను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో హైవేల విస్తరణకై ఇప్పటివరకు రూ.1.2 లక్షల కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత పొందాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 250 గ్రామ పంచాయతీల్లో వికసిత్  యాత్ర జరిగిందన్నారు. ఆయుష్మాన్  భారత్ పథకాన్ని కేసీఆర్  సర్కారు అమలు చేయలేదన్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ జాయింట్  సెక్రెటరీ రాజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ

జిల్లా ప్రజలంతా వికసిత్​ యాత్రను సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలన్నారు. వివిధ బ్యాంకుల ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. అడిషనల్​ కలెక్టర్​ కుమార్ దీపక్, బీజేపీ నేతలు దిలీప్​చారి, ఎల్ఎన్  సుధాకర్ రావు, యూనియన్  బ్యాంక్  డీజీఎం సత్యనారాయణ, డీఆర్డీవో నర్సింగ్ రావు, నాబార్డ్  డీడీఎం అఖిల్, ఎల్డీఎం కౌశల్ కిశోర్ పాండే, డీఎంహెవో సుధాకర్ లాల్  పాల్గొన్నారు.