ఇండియా ఎకానమీ 2047 నాటికి నెంబర్ వన్

ఇండియా ఎకానమీ 2047 నాటికి నెంబర్ వన్
  • పోర్టుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పది వేల మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరగనుంది
  • సాగర్‌‌‌‌‌‌‌‌మాల కింద ఇప్పటికే  272 ప్రాజెక్టులను పూర్తి చేశాం
  • షిప్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌లోనూ దూసుకుపోతాం: కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ 

న్యూఢిల్లీ: ఇండియా 2047 నాటికి  ప్రపంచంలో నెంబర్ వన్  ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్ర పోర్టు, షిప్పింగ్,  జలమార్గాల మంత్రి శర్బానంద సోనోవాల్  అభిప్రాయపడ్డారు.   బిజినెస్ స్టాండర్డ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌  సమ్మిట్‌‌‌‌లో మాట్లాడుతూ, 2047 నాటికి  పోర్టు కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పది వేల మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని చెప్పారు. షిప్‌‌‌‌బిల్డింగ్ రంగంలో 2030 నాటికి ప్రపంచ టాప్ 10లో, 2047 నాటికి టాప్ 5లో ఉంటామని అన్నారు. కాగా, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌‌‌‌లో రూ.11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రభుత్వం కేటాయించింది.   పోర్టుల సామర్థ్యం, డిజిటలైజేషన్, ఆటోమేషన్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌‌‌‌లు, తీర ప్రాంత పర్యాటకం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులను రూ.80 లక్షల కోట్లకు  పెంచింది.  షిప్‌‌‌‌బిల్డింగ్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని సోనోవాల్ చెప్పారు. 

“పోర్ట్‌‌‌‌లు, రైల్వేలను రోడ్లతో సమగ్రంగా అనుసంధానించాలి. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌ల కోసం ఉద్దేశించిన పరిశ్రమలు పోర్ట్‌‌‌‌లకు సమీపంలో ఉండాలి.  దీంతో  ఎగుమతులు వేగంగా  వృద్ధి చెందుతాయి” అని ఆయన  అన్నారు. సాగర్‌‌‌‌మాలా ప్రోగ్రామ్ కింద రూ.5.8 లక్షల కోట్ల విలువైన సుమారు 840 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. వీటిలో 272 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.  మహారాష్ట్రలోని వధవన్‌‌‌‌లో రూ.76 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న గ్రీన్‌‌‌‌ఫీల్డ్ పోర్ట్, సామర్థ్యం పరంగా భారత్‌‌‌‌లో అతిపెద్ద పోర్ట్‌‌‌‌గా మారనుంది.  కంటైనర్ పోర్టులో నిలిపే సమయం భారత్‌‌‌‌లో సగటుగా 3 రోజులు కాగా, యూఏఈలో 4, యూఎస్‌‌‌‌లో 7, జర్మనీలో 10 రోజులు. ఒక షిప్ పోర్టులోకి వచ్చి తిరిగి వెళ్లే సమయం  యూఎస్‌‌‌‌, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, జర్మనీ, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇండియాలో మెరుగ్గా ఉంది.  ప్రస్తుతం భారతదేశంలోని 9 పోర్టులు ప్రపంచ టాప్ 100 కంటైనర్ పోర్టుల జాబితాలో ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్ ప్రపంచ టాప్ 20లో స్థానం సంపాదించింది.