
న్యూఢిల్లీ: రాబోయే వర్షాకాలంలో అన్ని రంగాలకూ తగ్గినంత బొగ్గును సరఫరా చేస్తామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం అన్నారు. విద్యుత్ సహా వివిధ రంగాలలో డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాధారణంగా వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఫలితంగా గనుల నుంచి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీంతో విద్యుత్ ప్లాంట్లకు సరఫరా తగ్గుతుంది. ఈసారి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని రెడ్డి అన్నారు.
దేశానికి బొగ్గు అందించడానికి తమశాఖ అంకితభావంతో పని చేస్తోందని ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో అన్నారు. బొగ్గు సరఫరా గురించి చర్చిచండానికి మంత్రి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు కొరత లేదని, బొగ్గు దిగుమతులు తగ్గాయని, రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయ బొగ్గు ఉత్పత్తి 3.6 శాతం పెరిగి 81.57 మిలియన్ టన్నులకు చేరుకుంది.