త్వరలో కొమురవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్ : కిషన్ రెడ్డి

త్వరలో కొమురవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్ : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మనోహరాబాద్, కొత్తపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్ లో లక్డారం – దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లి స్టేషన్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.  కొమురవెల్లి భక్తుల సౌకర్యం కోసం రైల్వేస్టేషన్ అవసరాన్ని వివరిస్తూ కేంద్రమంత్రిగా పలుమార్లు  రైల్వేశాఖ మంత్రికి లేఖలు రాశానని తెలిపారు. ప్రత్యేకంగా కలిసి ఈ విషయంలో చొరవతీసుకోవాలని కోరానని శనివారం కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి ఆ శాఖ అంగీకారం తెలిపిందన్నారు. రైల్వే శాఖ నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతర ప్రారంభానికి ముందు కొమురవెల్లి మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వం అందించిన కానుక.. ఈ రైల్వేస్టేషన్ అని తెలిపారు. ఈ సందర్భంగా భక్తుల తరఫున ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి సమయంలో ప్రారంభమై.. ఉగాది వరకు మల్లన్న జాతర చాలా వైభవంగా జరుగుతుందని, ఈ జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చే భక్తులకు ట్రెయిన్​సౌకర్యం ఉంటే బాగుంటుందనేది దీర్ఘకాలంగా చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.