
- 20వేల సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్ల కేటాయింపు
- హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి డీ సెంట్రలైజ్డ్ గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, 20వేల సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇందుకు గాను జోషికి.. కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణలో సౌరవిద్యుత్ ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఇదొక సువర్ణ అవకాశం అని పేర్కొన్నారు.
పీఎం -కుసుమ్ స్కీమ్ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ స్కీమ్ 2026లో ముగియనున్నదని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ముందుకు రావాలని కోరారు. రైతులకు లబ్ధి చేకూర్చాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులపై విద్యుత్ భారం పడకుండా ఉంటుందన్న మోదీ ఆలోచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పీఎం-కుసుమ్ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.