రాష్ట్రంలో ఇంధన కొరత లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     వదంతులు నమ్మొద్దు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన పెట్రో కంపెనీల డీలర్ల అసోసియేషన్ నాయకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలిసి కవాడిగూడలోని సీజీవో టవర్ లో మీడియాతో మాట్లాడారు. కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధనం లేకపోవడం, పంపులు క్లోజ్​ చేయడం వంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలకు దారితీశాయన్నారు. 

దేశీయంగా రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ, అవసరమైన ఇంధనాన్ని దేశంలోనే అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే విదేశాల నుంచి దిగుమతులు కూడా సజావుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ పేదలకు గ్యాస్ సిలిండర్లు అందించడంతో వినియోగం పెరిగిందన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, రైల్వేల విద్యుదీకరణ చేపడుతోందని తెలిపారు. 

వదంతులను నమ్మొద్దని కోరారు. కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబంలా ఐక్యంగా  ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలన్నారు.  ఐఓసీఎల్ ఈడీ పియూష్​ మిట్టల్,​ బీపీసీఎల్ రిటైల్ సీజీఎం నితిన్ సెలుకర్, హెచ్​పీసీఎల్ రిటైల్​ సీజీఎం సుశీల్ కుమార్ రాయ్, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి, ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.