కేసీఆర్ ఢిల్లీ టూర్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారనడం అబద్దం

కేసీఆర్ ఢిల్లీ టూర్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారనడం అబద్దం

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రైతులను ఆదుకోవడం వదిలేసి, పంజాబ్ రైతులను కలుస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా బీజేపీ భయపడదన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై సెస్ తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్ పై పన్నులు వసూలు చేస్తోందన్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులతో పాటు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందని చెప్పారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై కేసీఆర్ కు కనీస అవగాహన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి, కేంద్రానికి కేసీఆర్ సర్టిఫికేట్ అక్కర్లేదన్నారు. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తానని గతంలో ఎన్నో సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పారని, అవన్నీ ప్రగతిభవన్ కే పరిమితం అవుతాయన్నారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు లంచ్ మీటింగ్ కోసం కేసీఆర్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికిన కేజ్రీవాల్ ఆయనను శాలువాతో సత్కరించారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర  కేంద్ర ప్రభుత్వం విధానాలు వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి ఉన్నారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. 600 కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొననున్నారు.

https://www.youtube.com/watch?v=lENgCzufKYQ

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీపై ముంబై గెలుపుతో ఆర్సీబీ సంబరాలు

కొడితే ఓకేనా!: భర్తలు, భార్యల్ని కొట్టొచ్చట